ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు మరో ఓటమి

by Dishanational3 |
ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు మరో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. రౌర్కెలా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫలితం షూటౌట్‌లో తేలింది. అంతకుముందు నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2-2తో సమవుజ్జీలుగా నిలిచాయి. భారత్, ఆసిస్ జట్లు అద్భుతమైన డిఫెన్స్ ప్రదర్శించడంతో తొలి క్వార్టర్ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 20వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఖాతా తెరిచాడు. కాసేపటికే ఆసిస్ తరపున గోవర్స్ బ్లేక్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే, 29వ నిమిషంలో అమిత్ రోహిదాస్ గోల్ చేయడంతో భారత్ ఫస్టాన్‌ను 2-1తో ఆధిక్యంతో ముగించింది.

ఆ తర్వాత ఆసిస్‌ను నిలువరించిన భారత్.. చివరి వరకూ లీడ్ కాపాడుకునేలా కనిపించింది. అయితే, ఆఖర్లో 53వ నిమిషంలో క్రైయిగ్ టామ్ గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. ఇక, చివరి 7 నిమిషంలో ఏ జట్టూ గోల్ చేయకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ చేసి విజేతగా నిలిచింది. మూడు ప్రయత్నాల్లో భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు ఇది రెండో ఓటమి. నేడు ఐర్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో భారత్ 4వ స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా, అర్జెంటీనా వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.



Next Story

Most Viewed