కేకేఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. ఇప్పటికే కెప్టెన్ అవుట్.. స్టార్ ఆటగాళ్లు దూరం!

by Disha Web |
కేకేఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. ఇప్పటికే కెప్టెన్ అవుట్.. స్టార్ ఆటగాళ్లు దూరం!
X

దిశ, వెబ్ డెస్క్: మరో పది రోజుల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 16వ సీజన్ కు ముందు కోల్ కత్త నైట్ రైడర్స్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా వచ్చే సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉంది. తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ తో పాటు మరో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నారు.

కేకేఆర్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ బంగ్లా ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్వదేశంలో ఐర్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆడుతోంది. ఐర్లాండ్ -బంగ్లాదేశ్ నడుమ మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక టెస్టు జరగాల్సి ఉంది. ఐర్లాండ్ - బంగ్లాదేశ్ ల మధ్య సిరీస్ లు ముగిసేసరికి ఏప్రిల్ 9 కానుంది. అప్పటికే ఐపీఎల్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ లు ముగిసేదాకా బంగ్లాదేశ్.. షకిబ్, దాస్ లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం అనుమానమేనని తెలుస్తుంది.

వెన్నునొప్పి గాయం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడని.. లేకుంటే కనీసం ఫస్టాఫ్ వరకైనా దూరం కానున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన షకిబ్ అల్ హసన్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు హసన్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నాడని తెలియడంతో కేకేఆర్ అభిమానులు షాక్ లో మునిగిపోయారు.

అయ్యర్ తో పాటు షకిబ్ కూడా దూరం కావడంతో మరి కేకేఆర్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఆ జట్టును వేధిస్తోంది. మూడు రోజుల క్రితం ఆ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ను కేకేఆర్ సారథిగా నియమించనుందని కూడా వార్తలు వినిపించాయి. ఈ మేరకు కేకేఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో ఓ ఫ్యాన్ పోస్టుకు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని తెలిపిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అసలు కేకేఆర్ సారథి ఎవరుంటారనేది ఆసక్తికరంగానూ మారింది.Next Story