జకో జోరు షురూ.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం

by Dishanational3 |
జకో జోరు షురూ.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన సెర్బియా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ తన ఆట మొదలుపెట్టాడు. ఈ డిఫెండింగ్ చాంపియన్ టోర్నీలో తొలి రౌండ్ నెగ్గి శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ జకోవిచ్ 6-2, 6-7(5-7), 6-3, 6-4 తేడాతో క్రొయేషియాకు చెందిన డినో ప్రిజ్మిక్‌ను ఓడించాడు. అయితే, అన్‌సీడ్ క్రీడాకారిడిని మట్టికరిపించేందుకు జకో శ్రమించాల్సి వచ్చింది. 4 గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌ నాలుగు సెట్లలో జరిగింది. తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గిన జకోకు రెండో సెట్‌లో క్రొయేషియా ప్లేయర్ షాకిచ్చాడు. టై బ్రేకర్‌లో రెండో సెట్‌ను గెలుచుకున్నాడు. ఇక, మిగతా రెండు సెట్లలోనూ డినో ప్రిజ్మిక్‌ గట్టి పోటీనివ్వగా జకో తన అనుభవంతో ఆ సెట్లను దక్కించుకుని విజేతగా నిలిచాడు. దీంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. డినో ప్రిజ్మిక్ అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయాడు. అలాగే, 4వ సీడ్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ), 5వ సీడ్ రుబ్లేవ్(రష్యా) తొలి రౌండ్‌లో విజయం సాధించారు.

మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, బెలారస్ క్రీడాకారిణి సబలెంక కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సబలెంక 6-0, 6-1 తేడాతో ఎల్లా సీడెల్(ఇటలీ)పై సునాయాసంగా గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను సబలెంక కేవలం 53 నిమిషాల్లోనే దక్కించుకుంది. సబలెంక 6 ఏస్‌లు, 20 విన్నర్లు కొట్టింది. ఉమెన్స్ డబుల్స్ డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో విజయం సాధించింది. జపాన్ క్రీడాకారిణి మై హోంటామా‌పై 6-2, 4-6, 3-6 తేడాతో నెగ్గింది. 8వ సీడ్ మరియా సక్కారి(గ్రీస్) రెండో రౌండ్‌కు చేరుకుంది.

Next Story