ఉత్కంఠ పోరులో బెంగళూరుపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై

by Harish |
ఉత్కంఠ పోరులో బెంగళూరుపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో రసవత్తర పోరుకు ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్ వేదికైంది. చివరి బంతి వరకూ టెన్షన్.. ఒక్క పరుగు తీస్తే సూపర్ ఓవర్.. రెండు పరుగులు తీస్తే బెంగళూరు విజయం.. రిచా ఘోష్ దూకుడు చూస్తే ఆర్సీబీదే గెలుపు అనిపించింది. కానీ, చివరి బంతికి అనూహ్యంగా రిచా ఘోష్ రనౌట్.. ఫలితంగా ఢిల్లీకి ఒక్క పరుగు తేడాతో విజయం దక్కింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఢిల్లీ వేదికగా ఆదివారం చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌నే వరించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఢిల్లీ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 180/7 స్కోరు చేసి పోరాడి ఓడింది. ఛేదనలో కెప్టెన్ స్మతి మంధాన(5) అవుటవడంతో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. అనంతరం ఎల్లీస్ పెర్రీ(49).. మరో ఓపెనర్ మోలినిక్స్(33)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. వీరిద్దరు స్వల్ప వ్యవధిలోనే అవుటైన తర్వాత జట్టు భారాన్ని రిచా ఘోష్(51) మీదేసుకుంది. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టును పోటీలోకి తీసుకొచ్చింది. చివరి మూడు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 40 పరుగులు కావాల్సి రాగా గెలుపు కష్టమే అనిపించింది. అయితే, మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా దూకుడుగా రిచా ఘోష్ లక్ష్యాన్ని ఒక్క బంతికి ఒక్క పరుగుకు తీసుకొచ్చింది. ఆమె దూకుడు చూస్తుంటే బెంగళూరు విజయం ఖాయమే అనిపించింది. అయితే, రిచా ఘోష్ రనౌట్‌గా వెనుదిరగడంతో ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు, ఢిల్లీ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

రోడ్రిగ్స్, క్యాప్సే మెరుపులు

అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు మెగ్ లానింగ్(29), షెఫాలీ వర్మ(23) ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. వీరు అవుటైన తర్వాత రోడ్రిగ్స్, ఎలీస్ క్యాప్సే మెరుపులు మెరిపించారు. ఫోర్లతో ధాటిగా ఆడిన వీరిద్దరూ బెంగళూరు బౌలర్లను పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఈ క్రమంలో శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌లో రోడ్రిగ్స్(58) క్లీన్ బౌల్డ్ అవడంతో 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్‌లో ఎలీస్ క్యాప్సే(48) కూడా శ్రేయాంక బౌలింగ్‌లోనే అవుటై హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. అదే ఓవర్‌లో జొనాస్సెన్(1) కూడా వెనుదిరిగింది. దీంతో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 181/5 స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో సత్తాచాటింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 181/5(20 ఓవర్లు)

(రోడ్రిగ్స్ 58, ఎలీస్ క్యాప్సే 48, శ్రేయాంక పాటిల్ 4/26)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 180/7(20 ఓవర్లు)

(రిచా ఘోష్ 51, ఎల్లీస్ పెర్రీ 49, మోలినెక్స్ 33)

Next Story