థామస్ కప్ బ్యాడ్మింటన్: ఇండోనేషియా చేతిలో భారత్ ఓటమి

by Swamyn |
థామస్ కప్ బ్యాడ్మింటన్: ఇండోనేషియా చేతిలో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్: చైనా వేదికగా జరుగుతున్న థామస్ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. చివరి గ్రూపు మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. గ్రూప్-సీలో భాగంగా బుధవారం జరిగిన పోరులో 14సార్లు చాంపియన్ ఇండోనేషియాపై భారత పురుషుల జట్టు 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత జరిగిన సింగిల్స్‌లో 13-21, 21-12, 21-12తో ప్రత్యర్థిపై విజయం సాధించిన హెచ్ఎస్ ప్రణయ్.. జట్టుకు శుభారంభం అందించాడు. అయితే, ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు చేతులెత్తేశారు. మెన్స్ డబుల్స్‌లో స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ.. 22-24, 24-22, 21-19తో ఫిక్రి-మౌలానా ద్వయం చేతిలో పరాజయం పొందగా, మూడు, ఐదో రౌండ్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ నిరాశపర్చారు. నాలుగో రౌండ్‌లో జరిగిన డబుల్స్‌లో ధ్రువ కాపిలా-సాయి ప్రతీక్ జోడీ సైతం చేతులెత్తేసింది. దీంతో 4-1తో ఇండోనేషియా విజయం సాధించింది. అయితే, ఇంగ్లాండ్, థాయిలాండ్‌ను ఓడించి ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకున్న భారత పురుషుల జట్టు.. ఈ పరాజయంతో గ్రూపు దశను భారత్ రెండో స్థానంతో ముగించుకుంది. ఇండోనేషియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.



Advertisement

Next Story

Most Viewed