భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. డీఎల్‌ఎస్ పద్ధతిలో టీమ్ ఇండియా గెలుపు

by Dishanational3 |
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. డీఎల్‌ఎస్ పద్ధతిలో టీమ్ ఇండియా గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు వరుసగా రెండో విజయం. సిల్హెట్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో బంగ్లాపై 19 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్‌ఎస్ పద్ధతిలో ఫలితం తేలింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళల జట్టు‌ను భారత బౌలర్లు స్వల్ప స్కోరుకే కుప్పకూల్చారు. భారత బౌలర్లలో రాధా యాదవ్(3/19), దీప్తి శర్మ(2/14), శ్రేయాంక పాటిల్(2/24) బంగ్లా పతనాన్ని శాసించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 119 పరుగులకే ఆలౌటైంది. ముర్షిదా ఖాతున్(46) రాణించడంతో బంగ్లాదేశ్ ఆ స్కోరైనా చేయగలిగింది.

అనంతరం 120 పరుగుల లక్ష్యంతో భారత జట్టు ఛేదనకు దిగగా.. కాసేపటికే వర్షం అడ్డుతగిలింది. ఆట ఆగిపోయే సమయానికి టీమ్ ఇండియా 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డీఎల్ఎస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. హేమలత(41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచి గెలుపొందింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గురువారం మూడో మ్యాచ్ జరగనుంది. అందులో గెలిస్తే మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతం కానుంది.

Next Story

Most Viewed