BAN vs NZ 2nd Test: రాణించిన కివీస్‌ స్పిన్నర్లు.. రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్ల తడబాటు

by Disha Web Desk 13 |
BAN vs NZ 2nd Test: రాణించిన కివీస్‌ స్పిన్నర్లు.. రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్ల తడబాటు
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు తడబడ్డారు. ఢాకాలోని షేర్‌ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్‌ అయింది. కివీస్‌ స్పిన్నర్లు గ్లెన్‌ ఫిలిప్స్‌ (3/31), మిచెల్‌ శాంట్నర్‌ (3/65)లు రాణించడంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫీకర్‌ రహీమ్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఓపెనర్‌ మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (14), జకీర్‌ హసన్‌ (8)తో పాటు తొలి టెస్టులో సెంచరీ చేసిన కెప్టెన్‌ నజ్ముల్ శాంతో (9), మోమినుల్‌ హక్‌ (5)లు విఫలమయ్యారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాను ముష్ఫీకర్‌ రహీం ఆదుకున్నాడు. అతడు షాదాత్‌ హోసెన్‌ (31)తో కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. కానీ అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్‌ (బంతిని చేతితో పట్టుకోవడం)తో రహీమ్‌ ఔటయ్యాడు. మెహిది హసన్‌ మిరాజ్‌ (20), నురుల్‌ హసన్‌ (7) లతో పాటు నయీమ్‌ హసన్‌ (13) లు విఫలమయ్యారు.Next Story