ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ సైమండ్స్ దుర్మరణం

by Disha Web |
ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ సైమండ్స్ దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రపంచంలో మరోసారి విషాదచాయలు అలుముకున్నాయి. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌ రౌండర్, లెజెండరీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతిచెందారు. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. క్విన్స్‌లాండ్‌ నగరానికి పశ్చమాన 50 కిలోమీటర్ల దూరంలోని హైవేపై వేగంగా వెళుతున్న కారు రోడ్డుపై బోల్తా పడి సైమండ్స్ మృతిచెందారని పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో సైమండ్స్ ఒక్కడే ఉన్నాడని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో సైమండ్స్‌కు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆండ్రూను రక్షించలేకపోయామని వైద్యులు ఆవేదన చెందారు.

కాగా, ఆస్ట్రేలియా జట్టు మూడు వరల్డ్ కప్‌లు గెలవటంలో సైమండ్స్‌ కీలక పాత్ర పోషించాడు. 1998లో పాకిస్తాన్‌పై జరిగిన వన్డేతో జట్టులో సైమండ్స్ ఆరంగేట్రం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తం 198 వన్డేలు ఆడిన ఆయన 5088 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 133 వికెట్లు పడగొట్టాడు. 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం అతని కెరీర్‌లో రికార్డు. 2004లో శ్రీలంకతో జరిగిన టెస్టుతో టెస్టు కెరీర్ ప్రారంభించిన సైమండ్స్ 26 మ్యాచుల్లో 1463 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేగాక, కెరీర్‌లో 14 ట్వీ20 మ్యాచులు ఆడిన ఆయన ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్‌(సన్ రైజర్స్ హైదరాబాద్) తరపున ఆడిన సంగతి తెలిసిందే. కాగా, సైమండ్స్ మరణవార్త తెలిసిన క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. షేర్‌ వార్న్‌ చనిపోయిన కొద్ది రోజులకే సైమండ్స్‌ మరణించడం ఆస్ట్రేలియా క్రీడాభిమానులను కలచివేసింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story