ఆర్చరీ ఆసియా కప్‌లో భారత ఖాతాలో నాలుగు పతకాలు.. రెండు స్వర్ణాలు కైవసం

by Harish |
ఆర్చరీ ఆసియా కప్‌లో భారత ఖాతాలో నాలుగు పతకాలు.. రెండు స్వర్ణాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ఇరాక్‌లోని బాగ్దాద్‌‌లో జరుగుతున్న ఆసియా కప్ ఆర్చరీ లెగ్-1 టోర్నీలో కాంపౌండ్ విభాగంలో భారత పురుషుల, మిక్స్‌డ్ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. పురుషుల టీమ్ కేటగిరీ ఫైనల్‌లో ప్రథమేశ్, ప్రియాన్ష్, కుశాల్‌లతో కూడిన భారత జట్టు 232-229 తేడాతో ఇరాన్ టీమ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. మూడో సెట్‌లో మినహా భారత జట్టు మిగతా మూడు సెట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. అలాగే, మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో ఆదితి గోపిచంద్, ప్రథమేశ్‌లతో కూడిన భారత ద్వయం 159-157 తేడాతో ఇరాన్‌కు చెందిన ఫతేమెహ్ హెమ్మతి-అర్మిన్ పక్జాద్ జోడీని చిత్తు చేసి గోల్డ్ మెడల్ సాధించింది. మరోవైపు, అదితి గోపిచంద్, ప్రియా, పర్ణీత్‌లతో కూడిన భారత మహిళల జట్టు రజతంతో సరిపెట్టింది. ఫైనల్‌లో ఇరాన్ టీమ్ చేతిలో 229-223 తేడాతో ఓడిపోయింది. ఇక, కాంపౌండ్ మహిళల వ్యక్తిగత కేటగిరీలో అదితి గోపిచంద్ కాంస్య పతకం సాధించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అదితి 148-145 తేడాతో సహచర క్రీడాకారిణి ప్రియా‌పై విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఒకే రోజు నాలుగు పతకాలు(రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం) చేరాయి. ఆదివారం రికర్వ్, కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీలతోపాటు రికర్వ్ టీమ్ ఫైనల్స్‌లో భారత ఆర్చరీలు అదృష్టం పరీక్షించుకోనున్నారు.



Next Story

Most Viewed