తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సర్ఫరాజ్ ఖాన్

by Harish |
తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సర్ఫరాజ్ ఖాన్
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరిసిన అతను వన్డే తరహా ప్రదర్శన చేశాడు. 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. గురువారం తొలి రోజు ఆట ముగిసిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ టీమ్ ఇండియా తరపున అరంగేట్రంపై ఆనందం వ్యక్తం చేశాడు. ‘నా తండ్రి ముందు భారత్‌కు ఆడాలనేది నా కల. ఆయన ముందే టీమ్ ఇండియా క్యాప్ అందుకున్నాను. మా నాన్న దేశం తరపున ఆడాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది నెరవేరలేదు. నా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు నా తమ్ముడి కోసం కష్టపడుతున్నారు. నా జీవితంలో ఇది చాలా గర్వించదగ్గ క్షణం.’ అని సర్ఫరాజ్ ఎమోషనల్ అయ్యాడు. పరుగులు, ప్రదర్శన గురించి తాను ఆలోచించలేదని, నాన్న ముందు ఆడటం చాలా ఆనందంగా ఉందన్నాడు. కాగా, సర్ఫరాజ్‌ ఖాన్‌తోపాటు ధ్రువ్ జురెల్ కూడా ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే టీమ్ ఇండియా క్యాప్ అందించాడు. అనంతరం సర్ఫరాజ్ ఆ క్యాప్‌ను తన తండ్రి నౌషద్ ఖాన్‌కు అందజేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

Next Story