చేయితో విసిరేస్తే చాలు.. కక్ష్యలోకి రాకెట్!

by  |
Rocket launch
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రాకెట్లను వినియోగిస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పద్ధతుల ప్రకారం ఇంధన ఖర్చు అధికమవడంతో పాటు తీవ్ర స్థాయిలో కాలుష్య కారకాలు విడుదలవుతాయి. ఇందుకు పరిష్కారంగానే అమెరికా, కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘స్పిన్‌లాంచ్‌’.. ‘సబ్ ఆర్బిటాల్ యాక్సిలరేటర్’ను రూపొందించింది. దీని ద్వారా సమీప భవిష్యత్తులో రాకెట్లను మరింత స్థిరమైన మార్గంలో అంతరిక్షంలోకి పంపవచ్చు. అదెలానో తెలుసుకుందాం.

సబ్‌ఆర్బిటాల్ యాక్సిలరేటర్ లోపల ఉండే ఒక స్పాన్ వాక్యూమ్ చాంబర్‌లో అతిపెద్ద రొటేటింగ్ ఆర్మ్ ఉంటుంది. ఇది ధ్వని వేగం కంటే అనేక రెట్లు ఎక్కువగా రాకెట్‌ను తిప్పేందుకు గతిశక్తిని ఉపయోగిస్తుంది. అనుకున్న వేగాన్ని చేరుకున్నప్పుడు, అదే వేగంతో కక్ష్యలోకి విసిరేస్తుంది. కాగా ఆర్బిట్ వెహికల్ కోసం స్పిన్‌లాంచ్ రూపొందించిన పరికరం సుమారు 200 కిలోగ్రాముల పేలోడ్‌ను కక్ష్యలోకి తీసుకెళ్లగలదు. ఇది కొన్ని చిన్న ఉపగ్రహాలకు సమానం. అక్టోబర్ 22న స్పిన్‌లాంచ్ ఒక నమూనా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించగా.. రాబోయే ఆరునెలల్లో స్పేస్‌పోర్ట్ అమెరికా, న్యూ మెక్సికో‌కు చెందిన 30 సబ్‌ఆర్బిటాల్ టెస్ట్ ఫ్లైట్స్‌ను నిర్వహించనుంది. అంతా సవ్యంగా సాగితే మరిన్ని పరీక్షలు నిర్వహించి 2024 కల్లా సబ్ ఆర్బిటాల్ యాక్సిలరేటర్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది.

సాంప్రదాయ రాకెట్లు భూమి నుంచి పైకి లేపడానికి పెద్ద బూస్టర్‌ను ఉపయోగిస్తాయి. సాధారణంగా ఇవి అనేక ఇంజిన్స్‌ను కలిగి ఉంటాయి. కాగా స్పిన్‌లాంచ్ విధానంలో రాకెట్ పరిమాణంతో పాటు వ్యయం కూడా తగ్గనుంది. ఇది వరకు రాకెట్‌ నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని ఫ్యూయెల్‌ గది ఆక్రమించగా.. ప్రస్తుతం ‘ఆల్టర్నేటివ్ లాంచర్‌’తో పంపుతుండడం వల్ల రాకెట్లకు ప్రత్యేకంగా ఫ్యూయెల్‌ గదిని నిర్మించాల్సిన అవసరంలేదు. దీంతో చిన్న సైజులో, తక్కువ ఖర్చుతోనే రాకెట్‌ నిర్మాణాన్ని పూర్తిచేయవచ్చు. దీనివల్ల పెద్ద ఉపగ్రహాలను రోదసీలోకి పంపే వీలు కలుగుతుంది.



Next Story

Most Viewed