దసరా తర్వాత కష్టాలుండవ్.. ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతి సౌకర్యం

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: పేషెంట్ తో పాటు ఆసుపత్రికి వచ్చే అటెండెంట్లకు దసరా నుంచి వసతి సౌకర్యాల ఇబ్బందులు రాకూడదని సీఎస్ సోమేశ్ కుమార్ ఆధికారులకు సూచించారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులకు పేషంట్లతో పాటు వచ్చే అటెండెంట్లకు వసతిని కల్పించేందుకు వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని ఆయన శనివారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అన్ని ఆసుపత్రుల హెచ్ఓడీలతో బీఆర్కే భవన్‌లో ఆయన శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

అన్ని ఆసుపత్రుల్లోనూ …

నిమ్స్, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, టిమ్స్, కింగ్ కోటి, ఫీవర్, ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వంటి ఆసుపత్రులకు నిత్యం రోగులతో పాటు పెద్ద సంఖ్యలో అటెండర్లు వస్తున్నా, సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో సీఎం ఆదేశాల మేరకు వసతి సౌకర్యాలను కల్పించాలని సీఎస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు హరేకృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్బిడీపై అల్పహారం, భోజన సౌకర్యాలను కూడా కల్పించనున్నారు.

అటెండెంట్‌ల సౌకర్యార్థం అన్ని వసతులు కలిగిన ఆశ్రయం, తాగునీరు, శానిటేషన్ లతోపాటు మహిళా అటెండెంట్‌లకై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయా ఆసుపత్రుల అధికారులకు సీఎస్ సూచించారు. వీటిని దసరా పండుగ నుంచి షురూ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, హరే కృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాస్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డా. జయలత, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, డాక్టర్ శంకర్ లతోపాటు కింగ్ కోటి హాస్పిటల్, నిలోఫర్, టిమ్స్ , కోటి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్లు సమావేశానికి హాజరయ్యారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story