టీ-కాంగ్రెస్ ఎండ్రికాయల కథ..

by  |
టీ-కాంగ్రెస్ ఎండ్రికాయల కథ..
X

దిశ, న్యూస్‌బ్యూరో: అది 135 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన జాతీయ పార్టీ. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ సామెతను తలపిస్తుంది. ఆ పార్టీ కేంద్రస్థాయిలో ఎలా ఉందో రాష్ట్రంలో అంతకంటే అధ్వానంగా ఉంది. జాతీయ స్థాయిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగానే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌ ఏ సమయంలో అస్త్రసన్యాసం చేస్తారో తెలియదు. తెలంగాణలో కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టాలని తహతహలాడుతున్నవారు దాదాపు డజను మంది ఉన్నారు. హోదా కోసమే తప్ప పార్టీని గట్టెక్కించాలనే ఉద్దేశం ఉత్తదేనని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. మూడు గ్రూపులు ఆరు కొట్లాటలు ఆ పార్టీ ప్రత్యేకత. ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి వేయడం ఆ పార్టీ లక్షణం. ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు కాళ్ళు పట్టి కిందకు లాగడం ఆ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆ పార్టీ నాయకత్వం పనిచేయదు. ఇంకొకరిని పనిచేయనివ్వదు.. అనే తరహాలో ఉనికి కోసం ఆరాటపడుతోంది.

తెలంగాణ తెచ్చిన పార్టీగా గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ, 2014లో ఓడిపోయింది. ఐదేళ్ళ నిరంకుశ పాలన.. గఢీల దొర పాలన.. అంటూ ఘాటైన విమర్శలు చేసే ఆ పార్టీ నేతలు 2018 ఎన్నికల్లో అడ్రస్ లేకుండాపోయారు. గెలవడమే గగనమనుకుంటే గెలిచినవారినీ ఆ పార్టీ కాపాడుకోలేకపోయింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భార్యను కూడా గెలిపించుకోలేకపోయారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. చివరకు పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించేశారు. ఆ పార్టీలోని చాలామంది నేతలు ఆ సువర్ణావకాశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నెలలు గడిచిపోతున్నాయి. కానీ, ఆ కార్యం మాత్రం జరగడంలేదనే నిరుత్సాహమూ చాలామంది పార్టీ నేతల్లో గూడుకట్టుకుంది.

పోస్టు ఒక్కటే… ఆశావహులు అనేకం
పీసీసీ చీఫ్ పదవి కోసం దాదాపు డజను మంది నేతలు పడరానిపాట్లు పడుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మొదలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, అప్పుడెప్పుడో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన వి.హనుమంతరావు వరకు చాలామంది క్యూలో ఉన్నారు. కానీ, అది వరించేదెవరినీ అనేది ఎవ్వరికీ తెలియదు. అంతా సోనియాగాంధీ నిర్ణయం కావడంతో ఆమెకు చాలా క్లోజ్ అనే మెసేజ్ పంపడానికి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్… ఇలా అందరూ ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వీరిలో ఒకరంటే మరొకరికి పడదు. ‘నాకు పదవి రాకున్నా ఫర్వాలేదు.. కానీ ఆయనకు మాత్రం రాకూడదు’ అని కోరుకునేవారే వీరంతా.

రేవంత్‌రెడ్డి వర్సెస్ ఇతరులు
ఒకే జిల్లాకు చెందినవారైనా ఉత్తమ్‌కు, కోమటిరెడ్డికి పడదు. నిన్నటిదాకా సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి, ఉత్తమ్‌కు పడదు. ఇక రేవంత్‌రెడ్డి అంటే ఎవ్వరికీ పడదు. ఆయన ‘వన్ మాన్ షో’ చేస్తారనేది ఒక కారణమైతే, పీసీసీ పగ్గాలు అప్పజెప్తే తమని లెక్కచేయరని, కొత్తవారితో నింపేసి పార్టీని తనచుట్టూ తిప్పుకుంటారన్నది వీరందరి భయం. వీరి ఉనికి ప్రశ్నార్థకమవుతుందనేది ప్రధానమైన ఆందోళన. అందుకే రేవంత్‌కు అవకాశం రాకుండా వీరంతా ఒక్కటవుతున్నారు. వారిలో వారికి ఎన్ని విభేదాలున్నా రేవంత్‌ను అడ్డుకునే విషయంలో మాత్రం అందరూ ఒక్కటే అనేది బహిరంగ రహస్యం. అందుకే ట్రిపుల్ వన్ జీవో విషయంలోగానీ, కేటీఆర్ ఫామ్ హౌజ్ విషయంలోగానీ రేవంత్‌రెడ్డి తలకెత్తుకున్న అంశాన్ని ఆ పార్టీ నేతలంతా వ్యతిరేకించారు. అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న అంశమే తప్ప పార్టీకి సంబంధం లేదని బహిరంగంగానే చాలామంది కామెంట్ చేశారు. చివరకు అరెస్టయ్యి జైల్లో ఉంటే.. కేవలం రాజ్యసభ నేత గులాం నబీ ఆజాద్ ఒక్కరే ఖండించారు తప్ప రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మాత్రం ఆయనకు ఎలాంటి సానుభూతీ లభించలేదు.

రేవంత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించే సమయంలో హఠాత్తుగా జగ్గారెడ్డి ప్రత్యక్షమై మొత్తం వ్యవహారాన్ని మరో డైరెక్షన్‌లోకి తీసుకెళ్తారు. ఇక దామోదర రాజనర్సింహది ఇంకో దారి. ఓబీసీ కార్డుతో వీహెచ్ రాజకీయం మరోవైపు. నొప్పించక తానొవ్వక తీరులో వ్యవహరించే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు వ్యూహం ఇంకో రకంగా ఉంటుంది. తెలంగాణ కోసం కొట్లాడిన గత చరిత్రను ప్రముఖంగా ప్రస్తావించుకుంటూ ఆ పదవి దక్కించుకోడానికి మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యూహం ఇంకో తీరు. పార్టీలో సీనియర్‌లను కాదని మరో పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెడితే ఊరుకునేది లేదంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పడంతోనే తనకెంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నది రేవంత్ వర్గీయుల వాదన. ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడే పార్టీ వైఖరి తెలిసిపోయిందని, ఇక్కడ సీనియర్, జూనియర్ అనే ప్రస్తావన అవసరం లేదన్నది వారి వాదన.

జైసే ఏఐసీసీ… వైసే పీసీసీ
ఇన్ని గ్రూపు కొట్లాటలు ఉన్నా పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉంటుంది. అధికారంలోకి వచ్చే అవకాశం కళ్ళ ముందు చేజారిపోతున్నా దిద్దుబాటు చర్యలు ఉండవు. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి అధిష్టానం సైతం పీసీసీ చీఫ్ విషయంలో సీరియస్‌గా లేదు. పీసీసీ పదవికి పోటీపడుతున్నవారిలో ఎవరి సత్తా ఏంటో, ఎవరి బలహీనత ఏంటో అధిష్టానానికి తెలియందేమీకాదు. కానీ, జాతీయస్థాయిలోనే పరిస్థితిని చక్కదిద్దుకోలేని నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ ఎదుగుదల లేదా పతనంలో బైటి పార్టీల ప్రమేయం కంటే సొంత పార్టీలోని గ్రూపులు, ఘర్షణలే కీలక భూమిక పోషిస్తున్నాయి. అధికార పార్టీకి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోవర్టుగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ కారణంగానే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని, ఉత్తమ్ ఉన్నంతవరకు పార్టీ ఎదగదని కూడా వ్యాఖ్యానించారు. అయినా పార్టీ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది.

సీనియర్ల ఆధిపత్య పోరు
ఆ పార్టీలో ముసలితరం, యువతరం మధ్య భేదాభిప్రాయాల గురించి చెప్పాల్సిన పనేలేదు. రేవంత్‌రెడ్డిని యువతరం అని భావిస్తున్న వృద్ధతరం నేతలు రకరకాల వాదనలను తెరపైకి తెస్తున్నారు. పార్టీ అధిష్టానమే యువతరం కావాలని కోరుకుని రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పజెప్తే ముసలితరం నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి తరహాలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఒకవైపు ప్రతిపక్షమే లేకుండా చేయాలని అధికార పార్టీ కోరుకుంటూ ఉంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాన్ని సాకారం చేస్తున్నది మాత్రం స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే. అధికార పార్టీని ఢీకొట్టి అధికారంలోకి రావాలన్న లక్ష్యం నెరవేరుతుందో లేదోగానీ కనీసం అస్థిత్వంలోనైనా ఉంటుందా అనే అనుమానం ఆ పార్టీని వెంటాడుతోంది. ఆ పార్టీకి శనిగ్రహం ఎవరో కాదు.. స్వంత పార్టీ నేతలే.

పాము చావొద్దు.. కర్ర విరగొద్దు తరహాలో పార్టీ అధిష్టానం వ్యవహారం ఉంది. అందులో భాగమే అసంతృప్తవాదులను దూరం చేసుకోలేక వర్కింగ్ ప్రెసిడెంట్ విధానాన్ని తెరపైకి తెచ్చి బుజ్జగించడానికి శ్రీకారం చుట్టింది. రేవంత్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటేగానీ అన్నీ స్వంత నిర్ణయాలే తీసుకుంటారు. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌ను కాదని తన నివాసం నుంచి వ్యవహారం నడిపిస్తారు. ఇక పార్టీ ప్రెసిడెంటే అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల గాంధీభవన్ గడప తొక్కడమే మానేశారు. పార్టీలో నియంత్రణ కరువైంది. ఎవరికి వారే యమునా తీరే లాగా తయారైంది. పార్టీ నాయకత్వం ఒక్కరి చేతిలో నుంచి పలువురి చేతిలోకి మారింది. సమన్వయం కొరవడింది.

పీసీసీ చీఫ్ ఎవరో?
జాతీయ స్థాయిలోనే పార్టీ నాయకత్వ లేమి వెంటాడుతుంటే ఇక రాష్ట్ర స్థాయి నాయకత్వం అందుకు భిన్నంగా ఉంటుందనుకోలేం. అందరినీ కలుపుకుపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో అందని ద్రాక్షే. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేసులో రేవంత్, కోమటిరెడ్డి, దుద్దిళ్ళ పేర్లు వినిపిస్తున్నా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించలేం. దూకుడుగా వ్యవహరిస్తారని ముద్రపడిన రేవంత్‌వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందా? లేక ఇప్పటికి ఎవరో ఒకరితో సరిపెట్టి ఎన్నికల సమయానికి రేవంత్ పేరును ప్రకటిస్తుందా అనేది త్వరలోనే తేలనుంది. ‘పార్టీ ఫస్ట్’ అనేది రానంతవరకు ఎవరినీ పీసీసీ చీఫ్‌ను చేసినా అది వారి వ్యక్తిగత పదవీదాహంగానే మిగిలిపోతుంది.

Next Story

Most Viewed