ఈసారి గృహిణులకు కలిసొచ్చిన న్యూఇయర్.. ఎలా అంటే?

by  |
cake-11
X

దిశ, శేరిలింగంపల్లి: న్యూ ఇయర్ అంటేనే కొత్త ఉత్సాహంతో, నయాసాల్ జోష్ తో జోరుదారుగా జరుపుకోవాలని ప్రణాళికలు రచించుకుంటారు ప్రతీ ఒక్కరు. ఫ్రెండ్స్ తో పార్టీలు, ఇంట్లో వాళ్లతో కేక్ కటింగ్ లు, మందు పార్టీలతో కుమ్మేయాలని ముందే ప్రిపేర్ అయిపోతారు. అందుకోసం నెలరోజుల ముందు నుండే ప్లాన్ చేస్తారు. డిసెంబర్ 31న ఏమేం చేయాలి, ఎలా హంగామా చేయాలని ఫ్రెండ్స్ తో కలిసి సమాలోచనలు చేస్తూ తెగ హడావుడి చేసేస్తుంటారు. కానీ, గత ఏడాదిలాగే ఈసారి కూడా పెద్దగా హడావుడి కానరావడం లేదు. ఇప్పటి వరకు రెస్టారెంట్లలో స్పెషల్ ఆఫర్స్ కానరావడం లేదు. పబ్బుల ప్రకటనలు అంతకన్నా లేవు. రిసార్ట్స్ ల్లో కార్యకలాపాలు.. ఉన్నా అవి కేవలం లిమిటెడ్ గానే.. చాలా దగ్గరి వాళ్లకే పరిమితం అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రతీ న్యూ ఇయర్ కు కామన్ గా ఉండే కేక్ లకు కూడా డిమాండ్ లేదు.

అంతా సాదాసీదాగానే..

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే తప్పనిసరిగా కేక్ ఉండాల్సిందే. అందరూ ఒక్కచోట చేరి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. కానీ, గత ఏడాది కరోనా పుణ్యమా అని ఎలాంటి వేడుకలు లేకుండా ఆంక్షలు అమలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో న్యూ ఇయర్ వేడుకలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఒకవేళ ఆంక్షల సడలింపు ఉన్నా ఒమిక్రాన్ భయాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు వేడుకలపై పెద్దగా ఆసక్తి కనబర్చినట్లు కనిపించడం లేదు. ఇంట్లోనే ఉండి వేడుకలు జరుపుకోవాలన్న అభిప్రాయమే చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

బయట ఫుడ్ వద్దు.. ఇంటి ఫుడ్ ముద్దు..

కోవిడ్ కారణంగా చాలా వరకు బయట ఫుడ్ ను తినడానికి ఎవరూ అంతగా ఇష్టపడడం లేదు. ఇది వరకు వీకెండ్ వచ్చిందంటే చాలు ఉదయం టిఫిన్ నుండి మొదలు రాత్రి డిన్నర్ వరకు మహానగర జనాల్లో మెజార్టీ ప్రజలు బయటే ఆరగించేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సండే, మండేలు అనే తేడాలు లేకుండా తమలోని పాకశాస్త్ర నైపుణ్యాలను వెలికితీస్తూ సాధ్యమైనంతవరకు ఇంట్లోనే వంట చేస్తూ హాయిగా లాగించేస్తున్నారు. ఇదే ఇప్పుడు నగరంలో ఫుడ్ బిజినెస్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది. మామూలుగా న్యూ ఇయర్ అంటేనే కేక్ కట్ చేయకుండా సెలబ్రేషన్స్ సాగేవి కావు. ఈసారి మాత్రం పెద్దగా కేక్ ఆర్డర్లు కూడా లేవని బేకరీ షాప్ ల యాజమాన్యాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31కి మూడు, నాలుగు రోజుల ముందే కేక్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉండే బేకరీ షాపులకు ఈసారి మాత్రం పెద్దగా పనిలేకుండా పోయింది. ఈ సమయానికే ఒక్కో షాప్ లో 60 నుండి 100 కిలోల కేక్ ఆర్డర్లు ఉండేవి, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని మోహన్ అనే బేకరీ షాప్ మేనేజర్ తెలిపారు. ఇక నగరంలో ప్రముఖ బేకరీ షాప్ అయిన కేఎస్ బేకర్స్ ఒక్క డిసెంబర్ 31నాడే ఒక్కో శాఖలో వెయ్యి నుండి 1200 కేకులు విక్రయించేది. ఇప్పటికైతే మాకు ఒక్క స్పెషల్ ఆర్డర్ రాలేదని చెబుతున్నారు స్టోర్ మేనేజర్ నర్సింహా. ఇవేకాదు దాదాపు అన్ని బేకరీ షాపుల్లోనూ ఇదే సిచ్యువేషన్ ఉంది.

ఇంట్లోనే కేక్ మేకింగ్..

న్యూ ఇయర్ కోసం రకరకాల కేక్ లను తయారు చేస్తాయి బేకరీలు. అరకిలో నుండి మొదలు ఎంత పెద్ద మొత్తంలో కావాలన్న ఆర్డర్ ఇస్తే చాలు రెఢీ చేస్తుంటాయి. మూడు రోజుల ముందు నుండే కేక్ ల తయారీలో తలమునకలుగా ఉంటారు. ఎలా కావాలంటే అలా వినియోగదారుల టేస్ట్ ను బట్టి కూల్ కేక్, ప్లం కేక్, బటర్ స్కాచ్, చాక్లెట్, ఎగ్, ఎగ్ లెస్, ఫ్రూట్స్ స్పెషల్ ఇలా ఎన్నో వెరైటీలు తయారు చేస్తుంటారు. వాటితోపాటు ప్రతీ న్యూ ఇయర్ కు కొన్ని బేకరీల యజమానులు స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తారు. కిలో సెలెక్టెడ్ కేక్ కొనుగోలు చేస్తే అరకిలో ఫ్రీ అని, లేదా కూల్ డ్రింక్ ఫ్రీ అంటూ ఆఫర్లు పెడుతుంటాయి. ఈసారి అలాంటివి కూడా ఎక్కడా కనిపించడం లేదు. వినియోగదారులు బయటకు వచ్చి కేక్ లు కొనే మూడ్ లో లేరని, వారిలో కరోనా భయాలు ఇంకా పోలేదని బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు. దానికితోడు కొత్త వేవ్ భయాలు కూడా జనాలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇదంతా ఎందుకు వచ్చిన బాధ అని ఇంట్లోనే కేక్ తయారు చేసుకుని, కుటుంబ సభ్యుల మధ్యనే కట్ చేసుకుని నయా సాల్ లోకి అడుగుపెడదాం అని చాలామంది ఆదిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య ఇంటర్ నెట్ సెర్చింజన్లలో కేక్ మేకింగ్ కు సంబంధించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. కేక్ ల తయారీపై ఇంట్లోనే ప్రయోగాలు చేస్తున్నారు మహిళలు. మొత్తానికి కరోనా పుణ్యమా అని కొన్నింటికి దూరం అయినా.. మరికొన్నింటికి దగ్గర చేసింది. కొత్త సంవత్సరాన్ని ఎవరికి వారు ఎక్కడో వేడుకలు జరుపుకుని రచ్చ రచ్చ చేసేదానికంటే, మనం ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే అవకాశం చాలా కాలానికి వచ్చింది.

డాక్టర్ హరీశ్ రావు..

ప్రతీ న్యూ ఇయర్ స్నేహితులతో కలిసి ఎక్కడో ఒకచోట స్పెషల్ గా చేసుకునే వాళ్లం. కానీ, చాలారోజుల తర్వాత మా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోబోతున్నా. ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్లతో కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

తేజా నర్సింహ్మారెడ్డి

ఈసారి మాకంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్లే సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాం. ఇంట్లో వాళ్లు ఇప్పటికే కేక్ తయారు చేయడం నేర్చుకున్నారు. మా ఇంట్లోనే స్పెషల్ ట్రీట్ ఉంటుంది. ఎక్కడికి బయటకు వెళ్లను.

సునీతారెడ్డి(గృహిణి)..

కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇంట్లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరూ బయటకు వెళ్లమని ప్రామిస్ చేశారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం స్పెషల్ గా వంటలు నేర్చుకున్నా. కేక్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. మా ఇంట్లో చేసిన కేక్ కటింగ్ తోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటాం.



Next Story

Most Viewed