120 పడకలతో కొండాపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు

by  |
120 పడకలతో కొండాపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తిని సకాలంలో ఆరికట్టేందుకు జిల్లాలో అత్యవసర చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ధర్డ్ వేవ్‌లో పిల్లలకు వైరస్ వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 120 పడకలతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా రాజేంద్రనగర్, చేవెళ్లలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్–19, ధాన్యం కొనుగోళ్ల పై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ… ఈ నెల 28, 29 తేదీల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు వేయాలని అన్నారు. సూపర్ స్పైడర్స్ కు టీకాలు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలతో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి అన్నారు. పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో పాటు కొవిడ్ పై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని అభినందించారు.

జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొవిడ్ కేర్ సెంటర్ లు, ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ఇంట్లో విడిగా ఉండే అవకాశం లేని వారికి ఇవి ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టానుసారం బిల్లులు వసూల్ చేస్తున్నారని, ఆ బిల్లులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. బ్లాక్ ఫంగస్ మందులతో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story

Most Viewed