తెలంగాణ మావోయిస్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్పీ సునీల్ దత్..

by  |
sp sunil
X

దిశ, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్రజల మద్దతు కోల్పోయిందని, నిషేధిత మావోయిస్టులు రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో తలదాచుకుంటూ.. అక్కడి ఆదివాసీలను వారికి రక్షణగా ఉపయోగించుకుంటుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి కమిటీ మావోయిస్ట్ బెటాలియన్, కిష్టారం ఏరియా కమిటీ సంచరించే జోన్లలో తలదాచుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ బెటాలియన్లో పనిచేయాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీలను బలవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

బొటేతొంగ్, ఇర్రపల్లి, రాసపల్లి, పినచంద, పెసలపాడు, ఎర్రంపాడు, మెట్టగూడ, కవురుగట్ట, కొండపల్లి, భట్టిగూడెం, పెద్దబట్టుమ్, జబ్బగట్ట, మినగట్ట, గుండెరాజగుడెం గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితులలో కూడా మావోయిస్టు పార్టీ దోపిడీకి గురి కావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాలలో ఆసుపత్రులు, రోడ్లు, విద్య లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా మావోయిస్టు పార్టీ అడ్డుకుంటుందన్నారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలను ఎప్పటికీ పేదవారిగా, అన్ని సౌకర్యాలకు, అభివృద్ధికి దూరంగా ఉంచుతుందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పనిచేసే దళ సభ్యులు, సానుభూతిపరులు, మిలిషియా సభ్యులు వారి బంధువుల ద్వారా గానీ, ప్రత్యక్షంగా గానీ పోలీసుల ఎదుట లొంగిపోవాలన్నారు. లొంగిపోయిన వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని ఎస్పీ సునీల్ దత్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed