అభయారణ్యంలో యథేచ్చగా ఎర్రమట్టి దందా..!

by  |
Soil smuggling
X

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపుర్ మండలంలోని పాకాల అభయారణ్యంలో ఎర్రమట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. కొందరు అధికారుల కనుసన్నల్లోనే అధికార పార్టీ నాయకులు ఈ దందా చేస్తున్నట్లు మండల వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాకాల అభయారణ్యం పరిధిలో జీవవైవిధ్య వాతావరణం ఉంది. ఈ ప్రాంతం అనేక వన్యప్రాణులకు సంరక్షణ కేంద్రంగా ఉంటోంది. ఇలాంటి ప్రాంతంలో తవ్వకాలు మైనింగ్ లాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ అక్రమార్కులు యథేచ్చగా ఎర్రమట్టిని రవాణా చేస్తున్నారు. నర్సరీల ఏర్పాటు కోసమని అంటూ అటవీ అధికారులకు చెబుతూ నామ మాత్రంగా నర్సరీలకు తరలిస్తున్నారు. పెద్ద మొత్తంలో ప్రైవేట్ వ్యక్తుల అవసరాల కోసం ఎర్రమట్టిని వినియోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాకాల సమీపంలోని ఒక ముఖ్య గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక నాయకుడు ఇటీవలి కాలంలో ఎర్రమట్టిని అభయారణ్యం నుండి ప్రైవేట్ స్థలంలో డంప్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఎన్నో ఖనిజ లవనాలున్న ఈ మట్టిని ఇతరుల అవసరాల మేరకు అమ్ముతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలు అభయారణ్యంలో తవ్వకాలకి అనుమతి ఉందా..!

అటవీ చట్టం ప్రకారం అభయారణ్యంలో ఎలాంటి తవ్వకాలకి అనుమతి ఉండదు. అక్కడ వివిధ రకాలైన జీవ జంతుజాలం నివసిస్తుంటాయి. వాటి జీవన శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత అటవీ అధికారులపై ఉంది. కానీ, నర్సరీల పేరుతో మట్టిని తవ్వుతూ నర్సరీలకి సరఫరా చేస్తూనే మరో మార్గంలో ప్రైవేట్ వ్యక్తులకు కూడా సరఫరా చేయడంతో పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నర్సరీలకి మాత్రం చట్టం ప్రకారం సరఫరా చేయవచ్చా అంటే అదేం లేదు.. జనం కోసం చేయాల్సిందేనని అధికారులు అంటున్నారు. మట్టి నర్సరీలకి కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిల్వ చేయడం నిజంగా జనం కోసమేనా..? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉద్భవిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నర్సరీల కోసం అభయారణ్యంలోని జంతుజాలన్ని ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టడం ఎంత వరకు సమంజసం అని మండల ప్రజలు వాపోతున్నారు.

చర్యలు తీసుకుంటాం :

పాకాల అభయారణ్యం నుండి మట్టి తరలింపు జరుగుతున్నట్లు నాకు ఇప్పటి వరకూ తెలియదు. ఈ విషయం ఈరోజే నా దృష్టికి వచ్చింది. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ను క్షేత్రస్థాయి నివేదిక కోసం పంపాను. వచ్చాక చర్యలు తప్పక చేపడతాం. – ఎఫ్ఆర్ఓ రమేష్

అక్రమ నిల్వదారుడిపై ఫైన్ విధించాము:

అశోకనగర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంటివద్ద అక్రమ మట్టి నిల్వలు గుర్తించాము. దానికి అతనికి 4000 జరిమానా విధించాము. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – ఇజాజ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్

Next Story

Most Viewed