ఎమ్మెల్యే బావది ఆత్మహత్యేనా?

by  |
ఎమ్మెల్యే బావది ఆత్మహత్యేనా?
X

దిశ, కరీంనగర్:
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణ‌రెడ్డి కుటుంబం కెనాల్‌లో శవాలై తేలినప్పటి నుంచి వీరి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలే సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణంలో లభ్యమైన డైరీలోని ఆధారాలు.. వీరిది ఆత్మహత్యే అని నిర్ధారించే అవకాశం ఉందా ? వీటిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతారా లేదా అన్న చర్చ సాగుతోంది. డైరీలో మృతుడు సత్యనారాయణ రెడ్డి రాశాడని భావిస్తున్న మాటల ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నారని భావించడం సరైంది కాదేమోనన్న భావన కూడా వ్యక్తం అవుతోంది.

సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆస్తిని రాసిస్తానని, తన షాపును గుమస్తాకు అప్పగించాలని డైరీలో రాసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సత్యనారాయణ రెడ్డి తన కుటుబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటే అదే విషయాన్ని వీలునామా రాసేవాడన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా అదే డైరీలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా ఎందుకు రాయలేదన్నది ప్రశ్న తలెత్తుతోంది. ఆ డైరీలోని రాతలు ఎన్ని రోజుల కిందటివి ? ఆ రైటింగ్ ఆయనదేనా అన్న విషయాలు తెలిస్తేనే క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు. మరోవైపు కొడుకు చనిపోయాడన్న వేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనా లేకపోలేదు. అయితే కొడుకు మరణం తరువాత కూడా సత్యనారాయణ రెడ్డి తన వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో పాటు ఆస్తులు కొనుగోలు చేశాడని, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశాడని తెలుస్తోంది. ఒకవేళ వారసుడు పోయాడన్న బాధతో కుంగిపోయుంటే..ఆస్తులను వృద్ధి చేసుకునేంత మానసిక స్థిరత్వం ఎవరికీ ఉండదనేది వాస్తవం. మానసికగా ఇంత దృఢంగా ఉన్నవారు ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదనేది మరో వాదన. కూతురు ప్రేమ వ్యవహారం కారణమేమో అన్న అనుమానాలు కూడా పలువురి నోట వినిపిస్తున్నాయి. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి కనీసం తన సన్నిహితుల వద్ద కూడా తన బాధను పంచుకోకపోవడం ఏమిటన్న ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు.

కాకతీయ కెనాల్‌లో బయటపడ్డ కారులో.. మృతదేహాలన్నీ కూడా వెనక సీట్లోనే ఉండటం వెనక ఆంతర్యం ఏంటి ? జనవరి 26న రేణుగుంట టోల్ గేట్ వద్ద కరీంనగర్‌కు వస్తున్నట్టుగా, 27వ తేదీ మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కరీంనగర్ నుంచి కారులో కుటుంబంతో సహా వెళ్తున్నట్టుగా సీసీ కెమెరా ఫుటేజీని బట్టి తెలుస్తోంది. అంటే జనవరి 27న సాయంత్రం వేళల్లో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనుకున్నా.. ఆ సమయంలో కెనాల్‌కు ఇరువైపులా ఉన్న పొలాల్లో పనిచేసే వారు కానీ, చేపలు పట్టే వారు కానీ గమనించే అవకాశం ఉంటుంది. కానీ కారు కెనాల్‌లో పడిపోయినట్టుగా ఎవరూ గమనించకపోవడం ఏంటన్నది అర్థం కావడం లేదు. ఒక వేళ రాత్రి పూట కెనాల్‌లో కారుతో సహా పడిపోయినట్టయితే మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి వరకు ఎక్కడున్నారనే విషయం అంతు చిక్కడం లేదు.

జనవరి మూడో వారంలో సత్యనారాయణరెడ్డి తన వ్యాపార భాగస్వాములతో కలిసి ముచ్చటించినప్పుడు.. ‘తన కూతురు ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్తానంటే వద్దన్నానని, దీంతో ఆమె నిరాశ పడిందని’ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే కుటుంబంతో కలిసి 15 రోజులు టూర్ ప్లాన్ చేశానని చెప్పినట్టు సమాచారం. అలాగే 26వ తేదీ హైదరాబాద్ కూడా వస్తానని చెప్పాడని వారు వెల్లడించారు. తన కుటుంబ విషయాలను స్నేహితులతో ఇంత కూలంకషంగా చర్చించే వ్యక్తి.. వారితో తన బాధను పంచుకోకుండా ఆత్మహత్య చేసుకునే అవకాశం లేనట్టు స్పష్టం అవుతోంది. సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ముందు వారి ఆనవాళ్లు తెలిసేలా.. ఏదో ఒక వస్తువును వదిలి వెళ్తారు. కానీ అలాంటిదేమీ చేయకపోవడం.. ఆత్మహత్య కాదేమోనన్న అనుమానాలకు బలం చేకూరుస్తోందని పోలీసులు కూడా చెప్పడం విశేషం.

అయితే సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ తరువాత తాళాలు పగలగొట్టి వారి ఇంట్లో వెతికిన వారు.. ఆయన ఎరువుల దుకాణంలో ఎందుకు వెతకలేదు ? ఇంట్లో వెతికిన విషయం వారు శవాలై తేలేవరకు బయటకు ఎందుకు చెప్పలేదన్న దానికీ సమాధానం లేదు. సత్యనారాయణ రెడ్డి కుటుంబంతో సహా బయటకు వెళ్లేప్పుడు 2 లక్షల రూపాయలు గుమస్తాకు ఇచ్చినట్టు చెబుతున్నారు. నమ్మకంగా గుమస్తాకు డబ్బులు ఇచ్చిన సత్యనారాయణ రెడ్డి.. ఇంటి తాళాలు కూడా ఆయనకే అప్పగించకపోవడం పైనా అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ కేసులో తవ్వే కొద్దీ సమాధానం లేని ప్రశ్నలెన్నో వెలుగు చూస్తుండగా.. సత్యనారాయణ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల మరణంపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. పోలీసులు నిజాల్ని నిగ్గుతేల్చే వరకు ఈ సస్పెన్స్‌కు తెరపడేలా లేదు.

tags: MLA Manohar reddy, Satyanarayana Reddy, family Suicide, Canal

Next Story

Most Viewed