'ధరణి’కి చికిత్స అనివార్యం

by  |
ధరణి’కి చికిత్స అనివార్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘రెవెన్యూ, భూ రికార్డులకు సంబంధించి ధరణి ఓ విప్లవం. మూడేండ్ల కఠోర శ్రమ చేసి తెచ్చిన పోర్టల్ ​ఇది. దాదాపు 16 రాష్ట్రాల నుంచి బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. కేంద్ర బృందం వచ్చి పరిశీలించింది. ఎక్కడైతే భూ రికార్డులు పారదర్శకంగా ఉంటాయో, డిజిటలైజ్​అయ్యాయో అక్కడ 3–4 శాతం జీడీపీ పెరుగుతుంది. నేరాలు తగ్గుతాయి. వ్యవసాయం పెరుగుతుందని ప్రపంచం మొత్తం చెప్తున్నది. తెలంగాణ భూ విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు. 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములుంటే 1.53 కోట్ల ఎకరాల భూమి ధరణిలోకి వచ్చింది. వీటిని ఎవరూ మార్చలేరు’’… అసెంబ్లీలో సీఎం కేసీఆర్.

గ్రేట్ ​ధరణి పోర్టల్​, కొత్త ఆర్వోఆర్​చట్టం అమలు ఎంత కష్టమవుతుందన్న విషయాన్ని ఉన్నతాధికారులెవరూ సీఎం కేసీఆర్​కు వివరించడం లేదు. లక్షలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పోర్టల్​లోని మాడ్యూల్​ ద్వారా దరఖాస్తు చేసుకొని నెలలు గడిచినా కనీసం పట్టించుకోని దాఖలాలు అనేకం. ఇప్పటికే ఎన్నో సమస్యలకు ఆప్షన్లు కనుక్కోలేదు. కనీసం పాసు పుస్తకంలో సర్వే నంబరు మిస్సయితే సరిదిద్దే అవకాశాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు, సీనియర్​ ఐఏఎస్ ​అధికారులెవరూ కనిపెట్టలేదు. ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు, ఆటోమెటిక్​ మ్యుటేషన్ ప్రాసెస్ ​బాగుంది. ఆ ఒక్క అంశాన్ని మిగతా భూ పరిపాలనా వ్యవహారాన్ని ముడిపెట్టి అంతా బాగుందంటూ ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో డిస్ప్యూట్​ఫ్రీ ల్యాండ్​ఎంత అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అత్యద్భుతమంటూ కీర్తించిన నోళ్లే ధరణి పోర్టల్​కి శస్త్ర చికిత్స అనివార్యమని గుర్తించారు. అందుకే కేబినేట్ ​సబ్​ కమిటీని నియమించింది. కొందరు మంత్రులకు ధరణి సెగ తగిలింది. తమకు పట్టాదారు పాసు పుస్తకాలివ్వడం లేదంటూ నిలదీసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆఖరికి తమ భూములను వేరే వాళ్ల పేరిట కట్టబెట్టారంటూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన దుర్ఘటనలు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తోన్ని నియోజకవర్గాల్లోనూ చోటు చేసుకున్నాయి. గతంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఎటూ తేల్చకుండానే చేతులెత్తేసింది. ఇప్పుడీ తాజా మంత్రివర్గ ఉపసంఘం ఏ మేరకు అధ్యయనం చేసి పరిష్కారాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. డేటా ఎంట్రీ నుంచే మొదలైన తప్పిదాలను సరిదిద్దే వ్యవస్థ రూపకల్పనకు ఈ మంత్రుల దగ్గరుండే మంత్రదండమేం లేదు. ధరణి పోర్టల్​రూపకల్పనలోనే లోపాలు ఉన్నాయని గుర్తించి శస్త్ర చికిత్స చేయడమే అనివార్యమని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదనపు విస్తీర్ణానికి పరిష్కారం?

కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా డేటాను సక్రమంగా రూపొందించలేకపోయారు. ధరణిలో 100 శాతం పక్కాగా నమోదు చేసిన గ్రామాల సంఖ్య పెద్దగా లేదు. . ప్రతి గ్రామంలోనూ కొన్ని సర్వే నంబర్లలో వ్యత్యాసాలను గుర్తించారు. వ్యవసాయం, వ్యవసాయేతర భూముల విస్తీర్ణంలోనూ తేడాలు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేసిన భూముల వివరాలు సక్రమంగా లేవు. కొన్ని రెవెన్యూ గ్రామాల కేసు స్టడీస్ ప్రకారం.. ధరణిలో నమోదు చేసిన భూ విస్తీర్ణానికి, వాస్తవ భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉంది. సర్వే నంబర్ల వారీగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిలో వివరించారు. కొన్ని సర్వే నంబర్లు అదృశ్యమయ్యాయి. ప్రభుత్వ భూములు, పబ్లిక్ ప్రాపర్టీస్ వివరాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. సాదా బైనామాలు, పీఓటీ కేసులు, ఇనాం భూములు, కోర్టు కేసులు, వాటి అప్పీళ్లు, ఆర్ఎస్ఆర్ ల్లో తేడాలు, సీలింగ్ భూములు, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, ఎవాక్యూ వంటి అంశాలకు సంబంధించిన భూములకు సంబంధించిన అనేక వివాదాలు పెండింగులోనే ఉన్నాయి. ఐతే వీటన్నింటికీ సేత్వార్, ఖాస్రా పహాణిల్లోని భూ విస్తీర్ణాలకు మరింత తేడాలు వచ్చేటట్లుగా ఉన్నాయి.

ధరణి సమస్యలు

– ఒక సర్వే నంబరులోని కొంత భూమి నిషేదిత జాబితాలోనే, వివాదాస్పదంగానో, ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే .. ఆ సర్వే నంబరు మొత్తం విస్తీర్ణాన్ని బ్లాక్​చేస్తున్నారు. ఏ తప్పు చేయని మిగతా రైతులు కూడా వాళ్ల భూములను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దేవాదాయ, వక్ఫ్​భూములుగా నిర్దారణ కాకముందే 22 ఎ కింద నమోదు చేశారు.

– ఏదేని సర్వే నంబరులోని కొంత భూమిని ప్రభుత్వం సేకరిస్తే అంత వరకు నిషేదిత జాబితాలో పెట్టడం లేదు. సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణాన్ని ప్రభుత్వానిదిగా పేర్కొన్నారు. దీంతో వేలాది మంది రైతుల భూములు నిషేదిత జాబితాలో చేరాయి.

– ఎవరైనా ఇద్దరు భాగస్వాములు కలిసి కొనుగోలు చేసిన భూములను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. జాయింట్ ​రిజిస్ట్రేషన్ కు ధరణి పోర్టల్​లో కాలమ్​ఇవ్వలేదు.

– కొత్తగా రిజిస్టర్ చేసుకునే ఆస్తులకు సంబంధించిన లింకు డాక్యుమెంట్ నంబర్లు జత చేయడం లేదు. ఏ ఒక్కటి అదృశ్యమైన టైటిల్​సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

– పట్టాదారు పాసు పుస్తకం ఇంటికి రాకపోతే రూ.300 కట్టి డూప్లికేట్​పాసు పుస్తకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒరిజినల్​ఏమైందని బ్యాంకర్ అడిగినా, కొనుగోలుదార్లు అడిగినా పోయిందని చెప్పడానికి లేదా తనకు ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పడానికి ఏ ఆధారాన్ని చూపాలి?

– నాలా కన్వర్షన్లయిన భూములను కూడా వ్యవసాయ భూములుగానే నమోదు చేశారు. వాటిని సరిదిద్దే మెకానిజం లేదు.

– వెంఛర్లు, విల్లాలు, ఇండ్లు వెలిసిన స్థలాలకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. వాటిని రద్దు చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ పట్టాదారులకు కూడా రైతుబంధు కింద సాయం అందిస్తున్నారు.

– గతంలో భూముల సర్వే నంబరు తప్పుగా పడినా, సరిహద్దుల కొలతలు తప్పుగా నమోదైనా తహశీల్దార్​స్థాయిలోనే సరిచేసుకునే వీలుంది. ఇప్పుడది లేనే లేదు.

– విరాసత్​లో అన్నదమ్ములు మధ్య పంపకాలు జరిగేటప్పుడు ప్రతి సర్వే నంబరులోనూ సగం చేయాల్సిందే. వారి ఇష్ట ప్రకారం పంపకాలు చేసుకునేందుకు వీల్లేకుండా ధరణి పోర్టల్​ అడ్డకుంటున్నది.

– భూ తగదాలు ఉన్న 3.73 లక్షల ఖాతాలను పార్టు బి లో చేర్చారు. ధరణి పోర్టల్​లో వాటిని పరిష్కరించడం లేదు. ఆ ఇరువర్గాలు పరస్పర అంగీకారాన్ని కుదుర్చుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునే వీల్లేకుండా చేశారు.

– ఇనాం భూములకు సంబంధించిన ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్లను అమలు చేయడం లేదు. ఇంకా సిటిజన్లకు ఆప్షన్లు కూడా ఇవ్వలేదు.

– తప్పొప్పులకు నో ఛాన్స్. ఖాస్రా పహాణీ, సేత్వార్ ప్రకారం.. ఖాతాదారులు, పట్టాదారులు, తండ్రి పేరు, నేచర్ ఆఫ్ ల్యాండ్, సర్వే నంబర్లు, విస్తీర్ణం వంటి ఏది తప్పు పడినా సరిదిద్దే వ్యవస్థ లేదు. కలెక్టర్ స్థాయిలో సరిదిద్దేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచిస్తున్నారు.

– మిస్సింగ్ సర్వే నంబర్లకు కొత్త ఖాతాలను రూపొందించేందుకు, ఖాతా అప్డేషన్, సేత్వార్ ఎంట్రీ వంటి సరిదిద్దేందుకు కలెక్టర్లకు అవకాశం ఇవ్వాలి.

Next Story