చేతిలో చంటిబిడ్డ.. నీటి ఒర్రె దాటితేనే ఆస్పత్రి..

by  |
చేతిలో చంటిబిడ్డ.. నీటి ఒర్రె దాటితేనే ఆస్పత్రి..
X

దిశ, కొత్తగూడ : ఏజెన్సీ మండలాల పరిధిలోని ప్రజల జీవన, ఆర్థిక పరిస్థితులు సాధారణ మండలాల కన్నా వేరుగా ఉంటాయి. విద్య, వైద్యం పరంగా సౌకర్యాల లేమి ఈ ప్రాంతాల్లో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. వారి స్థితిగతుల్ని మార్చడానికి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నా అధికారుల అలసత్వం కారణంగా గిరిబిడ్డలకు నేటికీ అన్యాయమే జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలంలో గల కామారం గ్రామంలో లక్షలు వెచ్చించి దాదాపు పదేండ్ల కిందట ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కామారంతో పాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు వైద్య సేవలు అందించడానికి ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఏజెన్సీ గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు, తల్లులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

సమస్యల వలయంగా హెల్త్ సబ్ సెంటర్…

కామారంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేశారు గానీ సౌకర్యాలు కల్పించడం మరిచారు. ఈ సబ్ సెంటర్ కి రావడానికి రోడ్డు లేదు. నీటి ఒర్రె ను దాటుకుని మరీ ఆస్పత్రికి రావాల్సి ఉంది. చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చే తల్లులు భయం భయంగానే ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్తే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. తలుపులు, కిటికీలు సరిగా లేకపోవడంతో వైద్య పరికరాలు అపహరణకు గురయ్యాయి. ఆస్పత్రి మెట్ల పైనే సిబ్బంది టీకాలు వేస్తున్నారు. రోగులు, బాలింతలు గదుల్లో కూర్చునే పరిస్థితి లేదు. గదిలో చీకటి, ఉక్కపోతకారణంగా ఆరుబయటే వైద్యం అందిస్తున్నారు.

అత్యవసరం అయితే అంతే…

గంగారం మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ అరకొరగా ఉంటుంది. ఇక కామారం, దాని చుట్టు పక్కల గ్రామాల పరిధిలో ఎలాంటి మొబైల్ నెట్వర్క్ లు పని చేయవు. ఈ నేపథ్యంలో కామారం హెల్త్ సబ్ సెంటర్‌కు చేరుకున్న వారికి అత్యవసర సేవలు అందించాల్సిన పరిస్థితి వచ్చినా, కనీసం ఆరోగ్య పరిస్థితి విషమించకుండా చేయాల్సిన ప్రాథమిక చికిత్స కూడా ఆస్పత్రిలో చేసే అవకాశం లేదు.

అధికారులు ఆదుకోండి…

కామారం హెల్త్ సబ్ సెంటర్ లో విద్యుత్ సరఫరా లేని కారణంగా అక్కడ అత్యవసర వైద్య సేవలు పూర్తిగా కరువయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

బుగ్గ ఎల్గలే… బిల్లు వచ్చింది..

రెండవ స్టాఫ్ నర్సుగా పదేండ్ల కిందట విధులలో చేరాను. ఆ ఏడే ఈ నూతన భవనాన్ని అప్పగించారు. ఆ నాటి నుండి నేటి వరకు మా ఉప కేంద్రానికి ప్రత్యేకంగా విద్యుత్ స్తంభం కేటాయించింది లేదు కానీ ఈ ఉపకేంద్రంలో ఒకటి కాదు రెండు విద్యుత్ మీటర్లు అమర్చారు. అసలు ఏనాడు ఒక బుగ్గ వెలిగిన పాపాన పోలేదు. మా ఉపకేంద్రానికి 2,50,000 విద్యుత్ బకాయి ఉందని విద్యుత్ సిబ్బంది రషీదు ఇవ్వటంతో నేను అవాక్కయ్యాను. వెంటనే ఆ బకాయి రషీదును కోమట్లగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులకు అప్పగించాను.
-వెంకటలక్ష్మి (స్టాఫ్ నర్సు )



Next Story

Most Viewed