జోరు తగ్గిందా.. ఈటల పాదయాత్ర లేనట్టేనా.?

by  |
Eatala-Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన పాదయాత్ర అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మొదలు పెట్టిన పాదయాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. అనారోగ్యం కారణంతో ఆగిన పాదయాత్ర తిరిగి కొనసాగుతుందా.? లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. కోలుకున్న తరువాత రెండు మూడు రోజుల్లోనే పాదయాత్ర కొనసాగిస్తానని ఈటల ప్రకటించినప్పటికీ నెల రోజులవుతున్నా పాదయాత్ర ఊసు మాత్రం ఎత్తడం లేదు.

ఉప ఎన్నిక షెడ్యుల్ విడుదలయ్యే నాటికి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి ప్రజా దీవెన యాత్ర పేరిట పాదయాత్ర మొదలు పెట్టారు. హుజురాబాద్ నియెజకవర్గంలోని అన్ని గ్రామాలను టచ్ చేసే విధంగా పాదయాత్ర రూట్ ప్లాన్ పక్కగా చేసుకున్నారు. ఈటల మొదలు పెట్టిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించడంతో ఆయనలో జోష్ పెరిగింది. రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ నేతగా ముద్రపడిన ఈటలను బీజేపీ నాయకుడిగా మెజార్టీ ప్రజలు గుర్తించలేకపోయారు. దీంతో ప్రజల్లోకి వెళ్లి తాను బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని చెప్పడంతో పాటు వారి మద్దతును కూడగట్టుకోవాలని పాదయాత్ర స్టార్ట్ చేశారు.

జూలై 19న కమలాపూర్ మండలం బత్తివానిపల్లి నుంచి ప్రారంభించిన పాదయాత్ర షెడ్యుల్ ప్రకారం ఐదు మండలాల్లోని 126 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. 12 రోజుల పాటు 70 గ్రామాల మీదుగా 222 కిలో మీటర్లు పూర్తైన తరువాత వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న తరువాత ఈటల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జూలై 30న పాదయాత్రకు బ్రేక్ పడినట్లయింది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈటలను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా ఆగస్టు 2న మోకాలికి సర్జరీ జరిగింది.

ఆపరేషన్ తరువాత నియోజకవర్గానికి చేరుకున్న ఈటల పాదయాత్రను త్వరలోనే కొనసాగిస్తానని ప్రకటించినప్పటికీ నెల రోజులు గడిచినా పాదయాత్ర వైపు మాత్రం అడుగులు పడటం లేదు. గ్రామ గ్రామాన సమావేశాలను నిర్వహిస్తూ అధికార పార్టీ టార్గెట్‌గా విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అయితే ఈటల తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ చేస్తున్న హడావిడికి తగ్గట్లుగా ముందుకు వెళ్లాలంటే గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్ర కొనసాగిస్తే ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుండదన్న అభిప్రాయలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీంతో యాత్ర మళ్లీ ప్రారంభించే అవకాశంపై సందేహలు వ్యక్తమవుతున్నాయి.


Next Story

Most Viewed