సీఎస్ఏ డైరెక్టర్‌గా.. మరో రెండేళ్లు ‘స్మిత్’ !

by  |
సీఎస్ఏ డైరెక్టర్‌గా.. మరో రెండేళ్లు ‘స్మిత్’ !
X

క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రేమ్ స్మిత్ పదవీకాలం మరో రెండేళ్ల పాటు పొడిగించబడింది. 2019 డిసెంబర్‌లో తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించబడ్డ ‘స్మిత్‌’ పదవీ కాలం.. ఐపీఎల్ ప్రారంభమయ్యే వరకు మాత్రమేనని సీఎస్ఏ గతంలో స్పష్టం చేసింది. అయితే, ఐదు నెలలుగా స్మిత్ పని తీరును పరిశీలించిన బోర్డు.. మార్చి 2022 వరకు అతడినే పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ఏ తాత్కాలిక సీఈవో జాక్వస్ పాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘స్మిత్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినా.. ఎంతో నిబద్ధత, చక్కని ప్లానింగ్‌తో సీఎస్ఏను నడిపించాడని’ జాక్వస్ కొనియాడారు.

స్మిత్ ఆటగాడిగా, కెప్టెన్‌గా గ్రౌండ్‌లో ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేసేవాడో.. అదేరీతిన దక్షిణాఫ్రికా క్రికెట్ అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. తాత్కాలిక జాతీయ సెలెక్టర్‌గా లిండా జోండిని నియమించడం అందులో ఒకటని.. ఇలాంటి అనేక నిర్ణయాలు స్మిత్ తీసుకున్నాడని ఆయన చెప్పారు. కాగా, తనను పూర్తి స్థాయి పదవిలో నియమించడంపై గ్రేమ్ స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు, రెండేళ్లు పదవి పొడగించడంతో క్రికెట్ అభివృద్ధికి మరింత పని చేసే అవకాశం వచ్చిందన్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌ను మెరుగు పరచడమే కాకుండా దేశవాళీ క్రికెట్ పటిష్టపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తానని’ స్మిత్ స్పష్టం చేశాడు.

Tags : Graeme Smith, South Africa, CEO Jacques Pal, CSA Director

Next Story