సినీ పరిశ్రమకు రాయితీలిస్తాం: కేసీఆర్

by  |
సినీ పరిశ్రమకు రాయితీలిస్తాం: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగిందని, షూటింగులు కూడా ఆగిపోవడంతో థియేటర్లు మూతబడ్డాయని, చివరకు ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని, పరిశ్రమను కాపాడడానికి ప్రభుత్వం తరపున అవసరమైన రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. షూటింగులు లేక, థియేటర్లు మూతబడి పరిశ్రమకు, అందులోని కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ఏం చేయాలో ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపారు.

సినీ నటులు నాగార్జున, చిరంజీవి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, ప్రధాన కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై కరోనా పరిస్థితుల కారణంగా సినీ పరిశ్రమకు జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వపరంగా వివిధ రూపాల్లో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

“రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. భేషుగ్గా ఉన్న సినీ పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబయి, చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తోంది. కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వపరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం” అని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story