ఏపీలోనూ ఘట్కేసర్ సీన్ రిపీట్.. ఫ్రెండ్ కోసం వెళ్లి డ్రామా..!

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా సంచలనం రేపిన యువతిని కాళ్లు చేతులు కట్టేసిన ఘటన కట్టుకథేనని పోలీసులు నిర్థారించారు. గుర్లలో రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లో ఒక అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులను కట్టేసి ఉన్నట్లుగా మార్చి 1, ఉదయం గుర్ల పోలీసులకు సమాచారం అందింది. దీంతో గుర్ల ఎస్ఐ నీలావతి మరియు ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంకు వెళ్ళి కాళ్ళు, చేతులు బంధించి అపస్మారక స్థితిలో ఉన్న 24ఏళ్ల యువతిని గుర్తించారు. ఆమెకు స్థానికుల సహకారంతో గుర్ల పోలీసులు సపర్యలు చేసి, చికిత్స నిమిత్తం గుర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అనంతరం అక్కడ నుంచి విజయనగరం ఘోషాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ రాజకుమారి ఈ కేసు దర్యాప్తును దిశ మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ టి.త్రినాధ్ కి అప్పగించారు. కేసు విచారణలో యువతి కట్టుకథ అల్లినట్లు నిర్ధారించారు. తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకు ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని అనుమతి తీసుకుని బయటకు వెళ్లింది. అయితే అదే సమయంలో హాస్టల్ లో తన గురించి తన సోదరుడు ఆరా తియ్యడంతో తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో గుర్ల దాటిన తరువాత బస్సు దిగింది.

గుర్ల రోడ్డు ప్రక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకుగాను తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు ఆమె అంగీకరించినట్లుగా తెలిపారు. తాను హాస్టల్ నుండి బయటకు వెళ్ళిన విషయంలో కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించేందుకే తనను గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులు కట్టేసినట్లు కట్టు కథ చెప్పినట్లు అంగీకరించిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం సిసీ ఫుటేజిల పరిశీలన ద్వారా నిర్ధారణ అయ్యిందని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. మెుత్తానికి ఈ ఘటన యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.