ప్యాసింజర్ వాహనాల్లో ఇకపై 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి!

74
nitin gadkari

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణీకుల భద్రతను పెంచేందుకు ఎనిమిది మంది వరకు ప్రయాణించే ప్యాసింజర్ వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా ఉండాలని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ముసాయిదాను నోటిఫై చేసింది. ఇది వాహనం ధర, వేరియంట్‌తో సంబంధం లేకుండా అన్ని విభాగాల్లో ప్రయాణీకుల భద్రతను కాపాడేందుకు వర్తించనుంది. ప్రభుత్వం 2019, జూలై నుంచి డ్రైవర్ సీటు ఎయిర్‌బ్యాగ్‌లను, ప్రస్తుత ఏడాది జనవరి 1 నుంచి ఫ్రంట్ కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం వాహనాల్లో ముందు, వెనక రెండు కంపార్ట్‌మెంట్లలో కూర్చున్న ప్రయాణీకులకు ప్రమాద స్థాయిని తగ్గించేందుకు అదనంగా ఎం1 కేటగిరి వాహనాల్లో నాలుగు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించామని నితిన్ గడ్కరీ చెప్పారు. ఎం1 కేటగిరి వాహనం అంటే ఒక వాహనంలో నలుగురు, అంతకంటే ఎక్కువమంది ప్రయాణీకులను కలిగినదిగా పరిగణిస్తారు. భారత్‌లో మోటార్ వాహనాలను గతంలో కంటే సురక్షితమైనవిగా మార్చేందుకు ఇది కీలక దశ అని గడ్కరీ వెల్లడించారు.