సింగిల్​ సీన్.. డ్యూయల్​ రోల్!

by  |
సింగిల్​ సీన్.. డ్యూయల్​ రోల్!
X

‘సీన్’చిన్నగా కనిపించినా, పాత్ర మాత్రం చాలా పెద్దదే. తహసీల్దార్ల పని భారం ఇప్పుడు అచ్చు అలాగే తయారైంది.. ఉదయం పూట ఒక ఆఫీసర్​ మాదిరిగా, మధ్యాహ్నం తర్వాత మరో అధికారిలా పరకాయ ప్రవేశం చేయాల్సిన గత్యంతరం ఏర్పడింది.. సర్కార్​ తీసుకొచ్చిన కొత్త ‘రెవెన్యూ’తో మల్టీ పర్పస్​ పాత్రను పోషించలేక తహసీల్దార్లు అపసోపాలు పడుతున్నారు. దీనికి తోడు వీఆర్వోలను కూడా తీసేయడంతో వారిపై మరింత పనిభారం పడింది. తమ పరిస్థితి ఎలా ఉన్నా సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైనా చర్యలు తీసుకోకపోతే జనాల్లో అబాసుపాలు కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పని భారం పెరిగిందని రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి ద్వారా భూ పరిపాలన, కొత్తగా రిజిస్ట్రేషన్ల బాధ్యతలు, నెల రోజుల్లోనే పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ మార్గనిర్దేశం ఇవన్నీ ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విధులను రెట్టింపు చేసినప్పుడు సిబ్బందిని పెంచకుండా నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశిస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను అదనంగా అప్పగించేటప్పుడు ఒక పూట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా, మధ్యాహ్నం తహసీల్దార్ గా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ వాస్తవ రూపం మరోలా ఉందని రెవెన్యూ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు భూ లావాదేవీలకు స్లాట్ల బుకింగ్స్ తోనే తహసీల్దార్లకు సరిపోతుంది. ఏ రోజు సెలవు పెట్టినా మరొకరు చూసే ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు. కలెక్టర్లు కూడా తరచూ వీడియో కాన్ఫరెన్సులు, సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి విధిగా హాజరు కావాలి. పైగా కలెక్టర్ల ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కొందరు తహసీల్దార్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేను పూర్తి చేస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు, రెవెన్యూ చట్టాల నిపుణులు, రిటైర్డ్ అధికారులు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి సూచించారు.

కంటిమీద కునుకు లేదు..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్ల చేతిలో పెట్టారు. ఇప్పటికే అనేక రకాల పనులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉండే వారికి ఈ రిజిస్ట్రేషన్ల అధికారాలు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు డాక్యుమెంటేషన్, అప్ లోడ్, సంతకాలు, వాంగ్మూలం వంటి వాటివాటితోనే సమయం గడిచిపోతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తహసీల్దార్ సమయమంతా కేటాయిస్తే మిగతా పనులన్నీ నిలిచిపోవడం ఖాయం. పైగా దాదాపు రోజూ ఏదో ఒక సమావేశం ప్రోటోకాల్ డ్యూటీలు, ప్రజాప్రతినిధుల సమావేశాల బాధ్యత కూడా తహసీల్దార్లదే. ఎన్నికలైనా.., పరీక్షల ఏర్పాట్లైనా.., ప్రకృతి వైపరీత్యాలు.., యాక్సిడెంట్లు.., ఆత్మహత్యలు.., ఇలా అన్ని పనులకూ రెవెన్యూ శాఖనే కీలకం. అలాంటి సందర్భాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతల నిర్వహణ వారికి ఆమోదమైనా జనానికి ఇక్కట్లకు గురి చేస్తుందని స్పష్టమవుతోంది. రెవెన్యూ శాఖలోని పెండింగులోని భూ సమస్యల పరిష్కారమంతా కలెక్టర్ల చేతిలో పెట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లోని వాటిని కలెక్టర్ల లాగిన్ లోకి పంపాలి. ఆయనేం విచారణ చేస్తారో.. ఎలా చేస్తారో.. ఎవరికి తెలియదు. అక్కడి నుంచి సంతకం పెట్టమని ఆదేశిస్తే మరో అభిప్రాయానికి తావు లేకుండా పని చేసి పెట్టాల్సిందే. ఆఖరికి రెవెన్యూ ట్రిబ్యునళ్లలో పెండింగులోని 16 వేల కేసులను నెల రోజుల్లోనే పరిష్కరించేందుకు కొందరు కలెక్టర్లు త్వరపడుతున్నారు. నోటీసులకు సమయం ఇవ్వకుండానే పూర్తి చేయాలంటూ ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు తహసీల్దార్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఎవరికీ వాదనలు వినిపించే అవకాశం ఉండకపోవడంతో కేసు ఏకపక్షంగా పరిష్కారమైతే కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉంటుంది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలనుకోవడం వల్ల పొరపాట్లు తలెత్తడం ఖాయమంటున్నారు. ఈ ప్రక్రియ వల్ల అధికారులు అబాసుపాలు కావడం, నిందలకు గురి కావడం తథ్యమన్న ఆవేదన వినిపిస్తోంది.

కబ్జాల నియంత్రణ వ్యవస్థ ఏది..?

ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకుండా పోయింది. గండిపేట, శేరిలింగంపల్లి, శంషాబాద్, కూకట్ పల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కీసర, మహేశ్వరం, బాలాపూర్, ఘట్ కేసర్, శామీర్ పేట, మూడుచింతలపల్లి, కందుకూరు, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో వీఆర్వోలు వెళ్లిపోతే ఎంత మంది సిబ్బంది ఉంటారో లెక్క తీస్తే ఐదారుగురికి మించరు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల సంరక్షణ ఎలా సాధ్యమని ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కబ్జాదారులంతా ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తో కంపౌండ్ వాల్స్ కట్టేస్తున్నారు. ఒక్క పూటలోనే పని పూర్తి చేసేస్తున్నారు. ఏ ఆదివారమైనా వస్తే చాలు ప్రభుత్వ భూములను వేరే సర్వే నంబర్లతో కబ్జాకు యత్నిస్తూనే ఉంటారు. మాకు ఫిర్యాదులు అందగానే వీఆర్వోలను పంపించే వాళ్లం. కూల్చేసి బోర్డులు పాతడం, కబ్జాకు యత్నించిన వారిపై కేసులు పెట్టడం పరిపాటి. ప్రధానంగా హైదరాబాద్ నగర శివార్లలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల రక్షణకు మానవ వనరులు లేకపోతే కష్టమే. సరిదిద్దని రెవెన్యూ రికార్డులతో హక్కుల కోసం ఇరువర్గాలు కొట్టుకునే రోజులు వచ్చే ప్రమాదమూ లేకపోలేదని అంటున్నారు.

ఇదీ పరిస్థితి..

* డిప్యూటీ త‌హసీల్దార్లకు, త‌హ‌సీల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్ ఇవ్వడం లేదు.
* 25 జిల్లాలలో డీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నా భ‌ర్తీ చేయ‌డం లేదు.
* కొత్త జిల్లాలు, మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటు చేసినా అందుకు తగ్గట్టుగా పోస్టుల సంఖ్య పెంచ‌లేదు. స‌రిప‌డా సిబ్బంది లేక‌పోవ‌డంతో ఆశించిన ఫ‌లితాలు రావడం లేదు.
* త‌హ‌సీల్దార్లకు ఇప్పటికే ప‌నిభారం ఎక్కువ ఉంది. రిజిస్ట్రేష‌న్ల బాధ్యతలు కూడా వారిపైనే పెట్టారు. వీటిని నిర్వహిస్తున్నా స‌రిప‌డా సిబ్బందిని కేటాయించ‌డం లేదు. ఉన్న సిబ్బందిపైనే ఒత్తిడి ఉంది.
* త‌హ‌సీల్దార్ల సాధార‌ణ బదిలీలలోనూ జాప్యం చేస్తున్నారు.
* వీఆర్వోలు లేక‌పోవ‌డంతో వారి ప‌నులు ఆగిపోయాయి. క్వాలిఫైడ్ వీఆర్వోల‌ను క్యాడ‌ర్ మారుస్తూ రెవెన్యూ శాఖ‌లోనే కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంది.
* స‌ర్టిఫికెట్ల జారీని త‌హ‌సీల్దార్ల నుంచి త‌ప్పిస్తామ‌ని చెప్పినా జరగలేదు. సాయంత్రం వ‌ర‌కు స్లాట్లను కేటాయిస్తున్నారు. మ‌రోవైపు స‌ర్టిఫికెట్ల జారీ పని ఉంటుంది. డిజిట‌ల్ కీ రిజిస్ట్రేష‌న్లకు వాడాలా ? స‌ర్టిఫికెట్ల జారీకి వాడాలా ? అనేది ఆలోచించాలి. వీలైనంత త్వరగా స‌ర్టిఫికెట్ల జారీని త‌హ‌సీల్దార్ల బాధ్యతల నుంచి తీసేయాలి.
* ప్రభుత్వం తీసుకొచ్చిన ధ‌ర‌ణి వెబ్‌సైట్‌లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. రికార్డులలో లోపాల‌ను స‌రిచేసేందుకు కావాల్సిన ఆప్షన్లు లేవు. రైతులు త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతూ
రెవెన్యూ సిబ్బందే త‌మ ప‌ని చేయ‌డం లేద‌ని అపోహ ప‌డుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులు బ‌ద‌నాం అవ్వాల్సి వ‌స్తోంది.
* భూరికార్డుల‌కు సంబంధించి మార్పులు చేసే ఆప్షన్లు మొత్తం త‌హ‌సీల్దార్ల నుంచి తీసేసి కలెక్టర్లకు ఇచ్చారు. భూ సమస్యలు ఉన్న రైతులు మాత్రం తహసీల్దార్ల వద్దకు వ‌స్తున్నారు.

Next Story

Most Viewed