తిండి, నిలువ నీడ లేక.. ఒంటరి మహిళ జీవన్మరణ పోరాటం

by  |
తిండి, నిలువ నీడ లేక.. ఒంటరి మహిళ జీవన్మరణ పోరాటం
X

దిశ, ములకలపల్లి : ఆ మహిళకు నా అనే వారు లేరు. నిలువ నీడ అసలే లేదు. రెక్కలు మంచిగున్న రోజుల్లో కప్పుకున్న పూరిగుడిసె శిథిలావస్థలో ఉంది. పై కప్పు గాలికి ఎగిరిపోయింది. దీంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. దీనికి తోడు ఇటీవల ఆమెకు క్షయ వ్యాధి బారినపడ్డారు. గతంలో ఎవరో ఒకరు వర్షానికి రాత్రి పూట ఆశ్రయం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ వ్యాధి మూలంగా చేరదీసే వారులేక ధీనావస్థ స్థితిలో బతుకుతోంది. తినేందుకు అన్నం దొరక్క అదుకునేవారు లేక ఆకలి చావుల మధ్య నలుగుతోంది.

వివరాల్లోకివెళితే.. ములకలపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన దమయంతి (50) ఒంటరిగా జీవన్మరణ పోరాటం చేస్తున్నది. సుమారు 24 ఏళ్ల వయసులో దమయంతికి వివాహం జరిగింది. వివాహమైన కొద్ది రోజుల్లోనే భర్త వదిలేశాడు. ఇప్పటికీ 23ఏళ్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నది. రెక్కలు మంచిగున్నన్ని రోజులు కాయకష్టం చేస్తూ జీవనం సాగించింది. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ప్రభుత్వం నుంచి పింఛన్ రాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఆమెకు ఉన్న పూరి గుడిసెపై తాటాకులు ఊడిపొయ్యి ఇల్లంతా బురదమయమైంది. కనీసం కూర్చునేందుకు కూడా వీలు లేకుండా తయారైంది. ఇన్నాళ్లు ఎన్నోకష్టాలు పడి బతుకీడుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె టీబీ వ్యాధితో బాధపడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మందులు అందుతున్నా.. సరైన తిండి లేక మందులు వాడటం లేదు. ఉన్న ఊళ్ళో చేయి చాచి ఎవ్వరినీ సహాయం అడగలేక జీవశ్చవంలా బతుకుతోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వైద్యంతో పాటు మూడు పూటలు ఆహారం అందించాలని సాయం కోసం ఎదురుచూస్తున్నది.

Next Story