సింగరేణి ఎండీ ఆదేశాలు.. బొగ్గు ఉత్పత్తిపై కీలక ప్రకటన

by  |
సింగరేణి ఎండీ ఆదేశాలు.. బొగ్గు ఉత్పత్తిపై కీలక ప్రకటన
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దేశ వ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిన నేపథ్యంలో కోల్ ఇండియాతో సహా సింగరేణి సంస్థ అధిక ఉత్పత్తిని సాధించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ క్రమంలో సింగరేణి తన వంతుగా ఈ ఏడాదికి నిర్దేశించిన 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాగించాలి.

దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని, రోజుకు కనీసం 1.85 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని సింగరేణి సంస్థ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ కోరారు. హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌ నుంచి సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని జనరల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉత్పత్తిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందిస్తున్నందు వల్ల తెలంగాణలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఒకటి, రెండు రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నందున సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచాలని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కోరుతోందని వివరించారు. కనుక ఈ పరిస్థితుల్లో సింగరేణి సంస్థ తన బాధ్యతగా నిర్దేశిత లక్ష్యాలకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఉపరితల గనులకు అవసరమైన ఓబీ కాంట్రాక్టులు, యంత్రాలు, వివిధ అనుమతులు మంజూరు చేసినందున ఈ గనుల నుంచి నిర్దేశిత లక్ష్యానికి తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి జరగాలని ఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఆగస్టు నెల వరకు గడచిన ఐదు నెలల్లో సింగరేణిలో కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, ఆర్జీ-2, ఆర్జీ-3, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాలు అత్యుత్తమంగా పనిచేశాయని అన్నారు. మిగిలిన ఏరియాలు కూడా ఇదే స్థాయిలో పుంజుకొని పనిచేయాలన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో బొగ్గు రవాణాలో 88.3 శాతం, ఉత్పత్తిలో 71.6 శాతం, ఓబీ తొలగింపులో 28.8 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ సంవత్సరాంతానికి 700 లక్షల టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలన్నారు.

కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్‌ ఓసీ-2 నుంచి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని, రామగుండం ఏరియాలో కొత్తగా మంజూరైన జీడీకే-5 ఓసీలో అక్టోబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ నెల నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయి కనుక రోజుకు కనీసం 1.85 లక్షల టన్నుల నుంచి 2.3 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించడం ద్వారా వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోగలుగుతామన్నారు.

ఈ ఏడాది సింగరేణి చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, అమ్మకాలు సాధించనున్నామని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా అందరూ ముందుకు సాగాలన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు అవసరమైన సహకారాన్ని అందించడానికి సింగరేణి ఉన్నతస్థాయి యాజమాన్యం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందన్నారు.


Next Story