‘నల్లనేల’పై ‘సౌర’వెలుగులు!

by  |
‘నల్లనేల’పై ‘సౌర’వెలుగులు!
X

సిరుల మాగాణి సింగరేణి విద్యుత్ తయారీ మీద దృష్టి సారించింది. నల్ల బంగారం ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఆ సంస్థ మరో మైలురాయిని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. త్వరలో సూపర్ పవర్ గా నిలువనున్న సోలార్ శక్తిని ఒడిసిపట్టేందుకు సిద్ధమవుతోంది. సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది, పునరుత్పాదక శక్తి స్థాపనలో దేశానికే ఆదర్శంగా నిలువబోతోంది. పర్యావరణానికి హాని చేయని విధంగా విద్యుత్ ఉత్పత్తి సాధించేందుకు శరవేగంగా ముందుకెళ్తూ అనేక పరిశ్రమలకు మార్గ నిర్దేశం చేయనుంది.

దిశ, ఖమ్మం ప్రతినిధి:
భూగర్భం నుంచి బొగ్గును వెలికితీసిన నల్లనేల ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చే సూర్య వెలుగుల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి సాధించేందుకు సిద్ధమౌతోంది. దాదాపు 300 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మూడు దశలలో సోలార్ ప్లాంట్లను బీహెచ్ఈఎల్ (భెల్) ఆధ్వర్యంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. మొదటి దశలో 129 మెగావాట్ల విద్యుదుత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఇల్లెందు, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మణుగూరులో రూ. 125 కోట్ల వ్యయంతో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో లక్ష సోలార్ ప్లేట్లతో 30 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ పూర్తయి గ్రిడ్ కు కూడా అనుసంధానం చేశారు.

జైపూర్ లో 10 మెగావాట్లు, ఇల్లెందు నియోజకవర్గం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో 39 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను పూర్తి చేశారు. రామగుండంలో 50 మెగావాట్ల సామర్థం గల ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిగిలిన ప్లాంట్ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రెండో దశలో 90 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 43 మెగావాట్లు, జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో 10మెగావాట్లు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏరియాలో 37మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది సింగరేణి.

మూడో దశలో ఫ్లోటింగ్ సోలార్ పవర్

రెండు దశలు పూర్తయిన వెంటనే మూడో దశలో పవర్ ప్లాంట్లను ప్రత్యేకంగా నిర్మించాలని సింగరేణి భావిస్తోంది. దీనికోసం ప్రదేశాలను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు 100 మెగావాట్ల సామర్థ్యంగల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. జలాశయాలు, ప్రాజక్టుల నీటి మీద ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందకు ప్లాన్ కూడా రూపొందించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, దిగువ మానేరు, ఎల్లంపల్లి బ్యారేజ్, మంచిర్యాల జిల్లాలోని సింగరేని థర్మల్ పవర్ ప్రాజెక్టు రా వాటర్ జలాశయాలపై సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూసేసిన భూగర్భ గనులు, ఓసీల మీద.. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. సింగరేణి కార్యాలయాలు, భూముల మీద ఫలకాలను అమర్చి భవిష్యత్ లో సోలార్ పవర్ ప్లాంట్ల విస్తరణ మరింతగా చేయనుంది.

మణుగూరు ప్లాంట్ కు ఒప్పందం

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మణుగూరు ఏరియాలో నెలకొల్పిన సోలార్‌ ప్లాంటు నుంచి 30 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును ఓపెన్‌ యాక్సిస్‌ కోసం తెలంగాణ ట్రాన్స్‌ కో (హైదరాబాద్‌), నార్తరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌, సింగరేణి సంస్థల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో శుక్రవారం మూడు పక్షాల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో సింగరేణి మణుగూరు ప్లాంటు నుంచి టీఎస్‌ ట్రాన్స్‌ కో లైన్ల ద్వారా అనుసంధానం చేసిన 30 మెగావాట్ల విద్యుత్తును మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో వాడుకోవడానికి, అలాగే దీనిలో కంపెనీ వాడుకోగా మిగిలిన విద్యుత్తును ట్రాన్స్‌ కో వారు కొనుగోలు చేయడానికి అంగీకారం కుదిరింది.

విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానం

ఇల్లందులో నిర్మించిన 39 మెగావాట్ల సోలార్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్ లో భాగంగా శనివారం 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి అనుసంధానం చేస్తూ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, తెలంగాణా రాష్ట్ర జెన్కో విద్యుత్ సంస్థ చీఫ్ ఇంజినీర్ (ఖమ్మం) జి.పుల్లయ్య, యస్ఈఓఎంసీ (ఖమ్మం) దీపక్ వాస్నిక్, కార్పొరేట్ సోలార్ జీఎం డీవీఎస్ సూర్యనారాయణరాజు, సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో మొట్టమొదటిసారిగా సోలార్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ట్రాన్స్కో కు అనుసంధానం చేయడం జరిగిందని.. ప్రస్తుతానికి 15 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి విద్యుత్ వినియోగంలోకి వస్తుందని అన్నారు.

భవిష్యత్ అంతా పర్యావరణ హితమే

కొన్ని వందల ఎకరాల నుంచి సింగరేణి బొగ్గు వెలికి తీస్తోంది. ఇది పర్యావరణానికి హాని చేస్తూనే ఉంది. వందల గ్రామాలు ప్రభావితం అవుతూనే ఉన్నాయి సోలార్ పవర్ ప్లాంట్లతో పర్యావారణానికి ముప్పు ఉడదు. థర్మల్ విద్యుత్ తో పోల్చుకుంటే డబ్బు చాలా ఆదా అవుతుంది. కార్మికుల సంఖ్య కూడా తక్కువే. కేంద్రం గనులను ప్రయివేటీకరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తిని నామమాత్రం చేస్తూ పూర్తిస్థాయిలో సోలార్ పవర్ జనరేషన్ మీదనే దృష్టి సారించే అవకాశాలూ లేకపోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రపంచం సోలార్ పవర్ వైపే చూస్తోంది. థర్మల్, హైడల్ ప్రాజెక్టులు భవిష్యత్ లో తరిగిపోయే వనరుల జాబితాలో చేరిపోయాయి. ఈ ప్లాంట్ల నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఇప్పడు దృష్టి అంతా సోలార్ పవర్ పైనే పడింది.

Read Disha E-paper

Next Story

Most Viewed