ఇండియా ఓపెన్‌లో సింధు క్వార్టర్స్‌కు.. సైనా ఇంటికి..

93
sindhu

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. టోర్నీలో కరోనా కలవరం సృష్టించడంతో పలువురు భారత స్టార్ షట్లర్లు టోర్నమెంట్‌ను వైదొలిగారు. అలాగే, భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగా.. సైనా నెహ్వాల్ ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఉమెన్స్ సింగిల్స్‌లో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో పీవీ సింధు 21-5, 21-6 తేడాతో మరో భారత షట్లర్ ఐరా శర్మపై సునాయసంగా విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ టోర్నీలో సింధు దూకుడును ఐరా అడ్డుకోలేకపోయింది. ఇక, మరో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు రెండో రౌండ్‌లో ఇంటిదారి పట్టింది.

భారత షట్లర్ మాళవిక మాన్సోద్ చేతిలో 21-17, 21-9 తేడాతో సైనా ఓడిపోయింది. 111వ ర్యాంకర్ మాళవిక షాట్లకు మాజీ వరల్డ్ చాంపియన్ వద్ద సమాధానమే లేదు. దీంతో మాళవిక వరుస సెట్లను దక్కించుకుంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రెండో సెట్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి గాయం తప్పుకోవడంతో సైనా రెండో రౌండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరో మ్యాచ్‌లో అస్మిత చలియా 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన యెల్లే హోయాక్స్‌పై గెలుపొందింది.

భారత క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయ 13-21, 21-7, 21-12 తేడాతో సింగపూర్ షట్లర్ జియా మిన్ చేతిలో పోరాడి ఓడింది. ఆకర్షి కశ్యప్ 21-10, 21-10 తేడాతో కెయూరా మోపతిపై విజయం సాధించింది. తన్య హెమాంత్ 21-18, 21-11 తేడాతో లారెన్ లామ్(అమెరికా) చేతిలో ఓడిపోయింది. మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ 21-12, 21-15 తేడాతో స్వీడన్2కు చెందిన ఫెలిక్స్ బురెస్టెడ్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అలాగే, హెచ్‌ఎస్ ప్రణయ్ వాక్‌ఓవర్ ద్వారా తర్వాత రౌండ్‌కు అర్హత సాధించాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌రాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి, ఇషాన్-సాయి ప్రతీక్ క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో నితన్-అశ్విని జోడీ 23-21, 21-7 తో ఈజిప్ట్ జోడీపై విజయం సాధించారు.