ప్రకృతి పరిరక్షణకు హైస్కూల్ విద్యార్థి ‘శ్రీజ’ నూతన ఆవిష్కరణ

386

దిశ, తెలంగాణ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లాలో బయోపాట్ల తయారీ ద్వారా స్తానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. దీనిని గద్వాలజిల్లా చింతలకుంట జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి శ్రీజ ‘బయోపాట్స్‌’ ఆవిష్కరణ చేసింది.

ఈ ఆవిష్కరణకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు టీ వర్క్స్, జీఈ అప్లయెన్సెస్‌ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ బయోపాట్లను పెద్ద సంఖ్యలో తయారు చేసేందుకు అవసరమైన ‘బయోప్రెస్‌’ యంత్రానికి ‘టీ వర్క్స్‌’ డిజైన్‌ చేసి అభివృద్ది చేయగా, ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ లోని టీ వర్క్స్‌ కార్యాలయంలో శుక్రవారం బయో ప్రెస్‌ యంత్రం నమూనా, పనితీరును టీవర్క్స్, జీఈ అప్లయెన్సెస్‌ ప్రతినిధులు పరిశీలించారు. శ్రీజ ఆవిష్కరణకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు త్వరలో గద్వాలలో బయోపాట్స్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మొక్కల పెంపకానికి నర్సరీల్లో ఉపయోగించే నల్లరంగు ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా వేరుశనగ పొట్టు మిశ్రమంతో తయారు చేసి కుండీల్లో మొక్కలు పెంచితే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని విద్యార్థి శ్రీజ భావించింది. తన సహ విద్యార్థి రామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు ఆగస్టీన్‌ సహకారంతో జీవ కుండీలు తయారు చేయడంలో విజయం సాధించింది. కుండీల తయారీకి అవసరమైన ముడి పదార్దాలు కూడా స్థానికంగా లభించేవి కావడంతో ఆవిష్కరణకు మరింత ఉపయోగపడింది.

శ్రీజ చేసిన ఆవిష్కరణకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌తో పాటు సీఎస్‌ఐఆర్‌ తదితర ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు లభించింది. జీవ కుండీలుగా పిలిచే బయోపాట్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు స్థానికంగా రూపొందించిన ‘బయో ప్రెస్‌’ యంత్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు టీ వర్క్స్, జీఈ అప్లయెన్సెస్‌ సాంకేతిక, ఆర్దిక సాయం అందిస్తున్నాయి.

ఈ యంత్రం ద్వారా గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. టీ వర్క్స్‌ సీఈఓ సుజయ్‌ మాట్లాడుతూ బయోపాట్‌ ఒక వినూత్న ఆలోచన ఉపాధి కల్పించే తయారీ పరిశ్రమగా అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఈ అప్లయన్సెస్‌లో, గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్, ఇన్నోవేటర్, ఇన్నోవేషన్ సంస్కృతిని సృష్టించడానికి భాగస్వామిని కలిగి ఉన్నామన్నారు. నూతన ఆవిష్కరణలకు టీవర్క్స్ తో కలిసి పనిచేయడంతోపాటు పర్యావరణ పరీరక్షణకు కృషి చేస్తామని అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..