దేశ వ్యాప్తంగా పది భాషల్లో సత్తా చాటిన శివశంకర్ మాస్టర్

by  |
Shiva Shankar master
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కరోనా బారినపడి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోన్న టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శివశంకర్(72) మాస్టర్ ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందిన సంగతి తెలిసిందే. 1948 డిసెంబర్ 7వ తేదీన చెన్నైలో జన్మించిన శివశంకర్ మాస్టర్, దేశ వ్యాప్తంగా 10 భాషల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. దాదాపు 800 చిత్రాలకు పైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన ఆయన పలు భాషల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డులు అందుకున్నారు. అంతేగాకుండా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కి దేశంలోనే సంచలనం సృష్టించిన ‘మగధీర’ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన శివశంకర్ మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది. చివరగా.. ఇటీవల వచ్చిన చిత్రాల్లో అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మహాత్మ, అరుంధతిలతో పాటు ప్రపంచ ఖ్యాతి పొందిన బాహుబలి-1 చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.

కాగా, శివశంకర్‌ మాస్టర్‌ భౌతికకాయాన్ని రేపు ఉదయం హైదరాబాద్‌ పంచవటిలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖు నటులే కాకుండా, తమిళ, కన్నడ, మళయాలం చిత్ర పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు కూడా రేపు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, చనిపోయే ముందు శివశంకర్‌ మాస్టర్‌కు కొవిడ్‌ నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అంతేగాకుండా.. ఆయన పెద్ద కుమారుడు విజయ్‌ శివశంకర్‌ ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది.

Next Story

Most Viewed