ఇన్ డోర్ మీటింగ్స్ ఖతం.. బహి‘రంగం’లోకి షర్మిల

by  |
ఇన్ డోర్ మీటింగ్స్ ఖతం.. బహి‘రంగం’లోకి షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటన చేసిన నాటి నుంచి యాక్టివ్‌గా ఉన్న వైఎస్ షర్మిల ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో అన్ని జిల్లాల అభిమానులతో ఇన్‌డోర్ మీటింగ్‌లను పూర్తి చేశారు. ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల మద్దతు కోరేందుకు ఔట్‌డోర్ యాక్షన్‌లోకి దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన షర్మిల ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆ జిల్లాలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటిదాకా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో జిల్లాల అభిమానులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఇక ఖమ్మం జిల్లాలో ‘సంకల్ప సభ’తో ప్రజాక్షేత్రంలోకి దూకడానికి సిద్ధమవుతున్నారు. పార్టీ విధివిధానాలు, జెండా, ఎజెండా తదితర వివరాలన్నింటినీ ఆ బహిరంగసభ వేదికగా వివరించి జూలైలో లాంఛనంగా ప్రకటించే తేదీని కూడా హింట్ ఇవ్వనున్నారు.

ఏప్రిల్ 9 సెంటిమెంట్

ఖమ్మం జిల్లాలో షర్మిల తలపెట్టనున్న సంకల్ప సభను ఏప్రిల్ 9వ తేదీనే నిర్వహించేందుకు ఒక ప్రత్యేక నేపథ్యముంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో అదే రోజున చేవెళ్ళ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఆ సెంటిమెంట్‌తోనే ‘సంకల్ప సభ’కు ఏప్రిల్ 9 ముహూర్తంగా పెట్టుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు కూడా అది శుభసూచకంగా ఉంటుందని షర్మిల అభిప్రాయపడుతున్నారు.

ఖమ్మం సభ మీదే ఫోకస్

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభిమానులు, నాయకులతో ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళనాలు మార్చి 31న ఉమ్మడి మెదక్ జిల్లా అభిమానులతో ముగింపునకు వచ్చాయి. ఇప్పటివరకు 50 రోజుల్లో ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల అభిమానులు, నాయకులతో షర్మిల సమావేశమయ్యారు. విద్యార్థులతో, మహిళలతో, ముస్లింలతో వేర్వేరు సమావేశాలను కూడా నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమ్మేళనాలతో ఒక సెక్షన్ ప్రజలకు చేరువయ్యారు. ప్రతిరోజూ లోటస్‌పాండ్‌కు వచ్చే పోయే అభిమానుల సంఖ్య పెరిగింది.

ఇంతకాలం అభిప్రాయాలు, సలహాలు తీసుకోవడంలో బిజీగా ఉన్న షర్మిల ఇప్పుడు పూర్తి ఫోకస్‌ను ఖమ్మంలో జరిగే ‘సంకల్ప సభ’ మీదనే పెడుతున్నారు. సభను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు సంబంధించిన పనులను షర్మిల ఒక్కొక్కటిగా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లలో తలెత్తుతున్న సమస్యలను తెలుసుకుంటూ అధిగమించే సూచనలు ఇస్తున్నారు. సభ విజయవంతం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పోలీసుల నుంచి అనుమతులు లభించడంతో భారీ స్థాయిలోనే సభ నిర్వహించి సక్సెస్ చేయాలనుకుంటున్నారు. మెట్టినిల్లు ఖమ్మం జిల్లా కావడం కూడా ఒక కారణం.

Next Story

Most Viewed