ఈ నెల 20 నుంచి షర్మిల పాదయాత్ర

by  |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. పార్టీ ఆవిర్భావం నాడే మరో 100 రోజుల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన షర్మిల.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈనెల 20వ తేదీన ‘ప్రజా ప్రస్థానం’ పేరిట సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా తన పార్టీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి తెస్తామో వివరించనున్నారు.

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ గా భావించే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ఆమె ఈ యాత్రను చేపట్టనున్నారు. కాగా ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. తొలుత అక్టోబర్​18వ తేదీన షర్మిల పాదయాత్ర చేపట్టాలని భావించారు. ఎందుకంటే తన అన్న, ఏపీ సీఎం జగన్ కోసం 2012లో పాదయాత్ర చేపట్టిన తేదీ కూడా అక్టోబర్ 18వ తేదీనే. కానీ పలు కారణాల దృష్ట్యా తేదీని ఈనెల 20కి మార్చుకోవాల్సి వచ్చిందని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి.

షర్మిల రాబోయే ఎన్నికలకు ఇదే యాత్రను అస్త్రంగా పెట్టుకున్నారు. ఈ యాత్ర చేపట్టడం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా ఒకేసారి పూర్తి చేయవచ్చని ఆమె భావిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి తన అన్న జగన్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 18 అక్టోబర్ 2012లో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించి 14 జిల్లాల్లో పర్యటించారు. 3,112 కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు 9 నెలలపాటు కొనసాగి 4 ఆగస్టు 2013లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. అయితే ఇప్పుడు షర్మిల తను చేపట్టిన 3,112 కిలోమీటర్ల రికార్డును తనే తిరగరాయాలని ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్రను విజయవంతం చేయాలని ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన రివ్యూ సమావేశాలు సైతం నిర్వహిస్తోంది. ఈనెల 18వ తేదీన కూడా పాదయాత్రకు సంబంధించి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని లోటస్​పాండ్​లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్లమెంట్ క‌న్వీన‌ర్లు, కో-క‌న్వీన‌ర్లు, పార్లమెంట్ కోఆర్డినేట‌ర్లు, రాష్ట్ర కార్యవర్గ స‌భ్యులు, యువ‌జ‌న విభాగం కోఆర్డినేట‌ర్లు, ద‌ళిత, మైనార్టీ, బీసీ, విద్యార్థి, గిరిజ‌న విభాగాల నాయ‌కులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా షర్మిల పాదయాత్ర ప్రారంభించేనాటికే గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ పార్టీని విస్తరింపజేయాలని వైఎస్సార్ ​జెండా పండుగను నెలరోజుల పాటు నిర్వహించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ ​విగ్రహాలు ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. ఇందుకు ఒక కోఆర్డినేటర్​ను సైతం ఆమె నియమించారు. వైఎస్సార్ ​విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటే తమ పార్టీని సంప్రదించాలని వైఎస్సార్​టీపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో షర్మిల చేపడుతున్న పాదయాత్ర సక్సెస్ కావాలని ఆదివారం ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర కన్వీనర్ ఇరుముళ్ల కార్తీక్, యువజన విభాగం కోఆర్డినేటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా కార్యకర్తలు సైతం పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.


Next Story