శంషాబాద్‌లో కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో యూట్యూబర్.. ఏం జరిగింది..?

by  |
Police
X

దిశ, శంషాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 40 మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని సన్ సిటీ, బండ్లగూడ, పిఎన్‌టి కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ డిసిసి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఏసిపి, సిఐలు మొత్తం 150 మంది పోలీసులు పాల్గొన్నారు. స్టూడెంట్ వీసాలతో భారత్‌కు వచ్చి వీసా గుడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న విదేశీయులను తనిఖీ చేయగా 40 మంది పట్టుబడ్డారు.

పట్టుబడ్డ వారిలో నైజీరియా యూట్యూబర్ చార్లెస్ కూడా ఉన్నాడు. యూట్యూబ్‌లో తెలుగు పాటలు పాడుతూ అందరిని అలరిస్తుంటాడు. అతడితో పాటు పట్టుబడ్డ వారు ఆఫ్రికా, సోమాలియా, నైజీరియా, కాంగోకు చెందిన వారుగా గుర్తించినట్లు డీసీసీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇచ్చేముందు సి ఫామ్ తీసుకుని ఉంచుకోవాలని, లేకుంటే ఇంటి యజమాని కూడా నేరస్తునిగా పరిగణించబడతారని ఆయన తెలిపారు.

అంతేకాకుండా మీ ఇంట్లో అద్దెకు దిగిన వారు డ్రగ్ లాంటి నేరాలకు పాల్పడితే మీరు కూడా బాధ్యులు అవుతారని తెలిపారు. విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇస్తే పూర్తి వివరాలు సేకరించి స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో ముడు వాహనాలతో పాటు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Next Story