‘కోతల’ పంచాయితీ.. కర్రలతో ఇరువర్గాల మధ్య పరస్పరం దాడి?

by  |
‘కోతల’ పంచాయితీ.. కర్రలతో ఇరువర్గాల మధ్య పరస్పరం దాడి?
X

దిశ, ఆర్మూర్/మాక్లూర్ : ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో చిన్నపాటి గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. వరి పొలం కోత విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ చినికి చినికి గాలి వానలా మారడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్ అనీస్ ఉద్దీన్, శేఖర్ మధ్య హార్వెస్టర్ విషయంలో గొడవ జరిగింది. గ్రామంలో వరి కోతలు కొనసాగుతున్నందున ముందుగా నా పొలం కోయాలంటే నాదే కోయాలంటూ ఇరువురు గొడవకు దిగారు.

ఈ క్రమంలో షేక్ అనీస్ ఉద్దీన్ ఇంటికి చేరుకొని తన కుటుంబ సభ్యులు బంధువులను వెంటబెట్టుకొని కర్రలతో శేఖర్ పై దాడి చేయడానికి అతని పొలం వద్దకు వెళ్లారు. భయభ్రాంతులకు గురైన శేఖర్ వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఊళ్లోకి చేరుకున్నాడు. అనీస్ ఉద్దీన్ వర్గం వారు సైతం గ్రామంలోకి చేరుకునే లోపు శేఖర్ సోదరులు, కుటుంబ సభ్యులు కర్రలతో బయలుదేరారు. ఇలా ఇరువర్గాల వారు కర్రలు చేత బట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లడంతో గ్రామ పంచాయతీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.

Next Story

Most Viewed