కొవిషీల్డ్ ధర ప్రకటించిన సీరం ఇనిస్టిట్యూట్..ఎంతో తెలుసా..?

by  |
కొవిషీల్డ్ ధర ప్రకటించిన సీరం ఇనిస్టిట్యూట్..ఎంతో తెలుసా..?
X

న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సంకల్పించిన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సీరం ఇనిస్టిట్యూట్ చేతులు కలిపింది. కరోనా కట్టడికి గాను ఆ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన కొవిషీల్డ్ ధరలను బుధవారం ప్రకటించింది. విదేశీ వ్యాక్సిన్ ధరలతో పోల్చితే సీరం ప్రకటించిన ధరలు తక్కువగానే ఉన్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు డైరెక్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు 50 శాతం డోసులకు అమ్ముకోవచ్చని కేంద్రం ఇటీవల ప్రతిపాదించిన నేపథ్యంలో సీరం ధరలను ప్రకటించింది. సీరం ప్రకటించిన ధరలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఒక డోసుకు రూ. 400 కు విక్రయించనుండగా.. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు దానిని రూ. 600 కు అమ్మాలని నిర్ణయించింది. విదేశీ టీకాలతో పోలిస్తే తమ వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటు ధరలోనే ఉందని సీరం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘అమెరికా తయారుచేసిన వ్యాక్సిన్లు రూ. 1,500 పైనే ఉన్నాయి. చైనా, రష్యాల టీకాలు రూ. 750 కి పైమాటే. వాటితో పోలిస్తే కొవిషీల్డ్ తక్కువగానే లభ్యమవుతున్నది’ అని ఆ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు అందజేస్తున్న వ్యాక్సిన్‌ను రానున్న నాలుగైదు నెలల్లో రిటైల్ మార్కెట్‌లోకి తీసుకొస్తామని వివరించింది. దాంతోపాటు మరో రెండు నెలలలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి కొరతను అధిగమిస్తామని సీరం తెలిపింది. వచ్చే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండినవారు టీకాలు వేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాక్సిన్ తయారీసంస్థలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి.

Next Story

Most Viewed