రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ‘సీరో’ సర్వే..

by  |
రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ‘సీరో’ సర్వే..
X

దిశ, న్యూస్ బ్యూరో:

రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అధ్యయనం చేయడానికి నగరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారులు, శాస్త్రవేత్తలు రెండో దఫా సర్వే ప్రారంభించారు. మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ అధ్యయనంలో ప్రతీ జిల్లాలో పది గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 1200 మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తారు. వాటిని పరీక్షించి యాంటీ బాడీస్ ఏ మేరకు ఉన్నాయో పరిశీలించి, దీన్ని బట్టి ఆ ప్రాంత ప్రజల్లో వైరస్ వ్యాప్తి ఏ మేరకు జరిగిందో నిర్ధారణకు వస్తారు.

దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ మార్గదర్శకత్వంలో 70 జిల్లాల్లో నడుస్తున్న ఈ సర్వేలో భాగంగా తెలంగాణలో మూడు జిల్లాలను ఎంపిక చేసుకుంది. మే నెలలో సైతం ఇవే మూడు జిల్లాల్లో సీరో సర్వే నిర్వహించగా మూడు నెలల తర్వాత వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు బృందాలు తేల్చనున్నాయి. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత నివేదికను తయారు చేసి ఐసీఎంఆర్‌కు, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖకు సమర్పించనున్నాయి.

ఈ సర్వే ఎలా జరుగుతుంది?

కామారెడ్డి, జనగాం, నల్లగొండ జిల్లాల్లో పది గ్రామాల చొప్పున మొత్తం 30 గ్రామాలను ఎన్ఐఎన్ బృందాలు ఎంపిక చేసుకుంటాయి. ఒక్కో గ్రామంలో 40 మంది చొప్పున మహిళలు, పురుషులను ఎంపిక చేసుకుంటాయి. పదేళ్ల వయస్సు పైబడినవారి నుంచి రక్త నమూనాలను సేకరిస్తాయి. అంటువ్యాధులు ప్రబలినప్పుడు నిర్వహించే సీరో సర్వే తరహాలోనే ఇప్పుడు కూడా కరోనా వైరస్ ఏ మేరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. ఒక్కో జిల్లాలో ఐదు చొప్పున మొత్తం 15 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఒక్కో బృందంలో నలుగురి చొప్పున, మొత్తం 60 మందిని సర్వే కోసం వినియోగిస్తున్నట్లు ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆవుల లక్ష్మయ్య తెలిపారు. తొలుత కామారెడ్డి జిల్లాతో అధ్యయనం మొదలుపెట్టామని, రోజుకో జిల్లా చొప్పున మూడు రోజుల్లో అధ్యయానాన్ని పూర్తిచేస్తామని వివరించారు.

సర్వే తర్వాత ఏం జరుగుతుంది?

రెండో దఫా సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా వైరస్ వ్యాప్తి తీరుపై స్పష్టత వస్తుందని, దానికి తగినట్లు ఏం చర్యలు తీసుకోవచ్చునో తెలుస్తుందని డాక్టర్ లక్ష్మయ్య చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే వైరస్ వ్యాప్తి భిన్నంగా ఉంటుందని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి పెట్టామని తెలిపారు. పట్టణాల్లో వైరస్ వ్యాప్తి సహజంగానే ఎక్కువగా ఉంటుందన్నారు.

పల్లెల్లో మాత్రం ప్రజల కదలికలు పరిమితంగా ఉండడం, కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నందున ఈ సర్వేలో కూడా పట్టణాలకంటే తక్కువగానే వ్యాప్తి ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపారు. మే నెలలో నిర్వహించిన సర్వేలో జనగాం జిల్లాలో 0.49%, కామారెడ్డిలో 0.35%, నల్లగొండలో 0.25% చొప్పున వైరస్ వ్యాప్తి ఉన్నట్లు తేలిందని, ఈ నెలలో కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కేసులు బాగా పెరిగినందున తాజా అధ్యయనంలో రిపోర్టులు భిన్నంగా వస్తాయనే అభిప్రాయాన్ని బృందంలోని సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు.

తాజా సర్వేలో వచ్చే ఫలితాలు కంటైన్‌మెంట్ కోసం అనుసరించాల్సిన విధానాలు, జాగ్రత్తలపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రూపొందించడానికి దోహదపడుతుందని డాక్టర్ లక్ష్మయ్య చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏ తీరులో వైరస్ వ్యాపించింది, వ్యాప్తికి గల కారణాలను స్థానికంగా ఉండే రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి ప్రభుత్వాలు ఒక అంచనాకు వస్తాయని వివరించారు.

Next Story

Most Viewed