ఎట్టకేలకు లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు!

by  |
ఎట్టకేలకు లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్:ఎట్టకేలకు దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. వరుసగా ఐదు రోజుల నష్టాలకే కాకుండా గత మూడు వారాలుగా నమోదవుతున్న వారాంతం నష్టాలకు కూడా శుక్రవారం నాటి లాభాలు బ్రేక్ వేశాయి. ఉదయం ప్రారంభంలోనే అధిక నష్టాలను చూసిన సూచీలు మిడ్-సెషన్ వరకు అదే ధోరణి కొనసాగిస్తూ భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల నుంచి మద్ధతు లభించడంతో తిరిగి లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బాండ్ ఈల్డ్స్ పెరగడం, మార్కెట్లు ప్రతికూలంగా ఉండటంతో ఉదయం దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మిడ్-సెషన్ నుంచి కీలక రంగాలు పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయని పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 641.72 పాయింట్లు ఎగసి 49,858 వద్ద ముగియగా, నిఫ్టీ 186.15 పాయింట్లు లాభపడి 14,744 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ రంగం షేర్లు అత్యధికంగా 2.5 శాతం పుంజుకోగా, ఐటీ, ఫార్మా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, టైటాన్, మారుతీ సుజుకి షేర్లు నష్టపోగా..మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.48 వద్ద ఉంది.


Next Story

Most Viewed