తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్పంగా నష్టపోయిన సూచీలు

62

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావడం, గడిచిన ఐదు సెషన్లలో సూచీలు వరుస లాభాలతో గరిష్ఠాల లాభాల స్వీకరణ కారణంగా వారాంతం తక్కువ నష్టాలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం అధిక నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ సమయానికి పుంజుకున్నాయి. అక్కడినుంచి లాభ నష్టాల మధ్య కదలాడిన అనంతరం స్వల్ప నష్టాలతో ట్రేడయ్యాయి. దేశీయంగా మఓ రెండు వారాల్లో వెలువడబోయే కేంద్ర బడ్జెట్‌తో పాటు మెరుగైన త్రైమాసిక ఫలితాలు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మద్దతిచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా ఎగుమతుల వృద్ధి, టోకు ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉండటం, ఎఫ్ఐఐ కొనుగోళ్లతో నష్టాలు తగ్గాయని నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 12.27 పాయింట్లు తగ్గి 61,223 వద్ద, నిఫ్టీ 2.05 పాయింట్లు క్షీణించి 18,255 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, రియల్టీ రంగాలు పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో సహా మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎంఅండ్ఎం, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.11 వద్ద ఉంది.