టాలీవుడ్ డ్రగ్స్ కేసు : వెలుగులోకి సంచలన నిజాలు

1274
Drugs case

దిశ, ప్రత్యేక ప్రతినిధి : తీగలాగితే డొంక కదులుతున్నది. డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీనటులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఈడీ సమన్లతో కేసు కీలక మలుపు తిరగనుంది. నాలుగేండ్ల కిందట తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో దగ్గుబాటి, రకుల్ పేర్లు లేవు. రానా ఇంతవరకు విచారణకు కూడా హాజరు కాలేదు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో హవాలా ద్వారా భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జారీచేసిన సమన్ల జాబితాలో ఈ ఇద్దరిపేరు ఉండటం విశేషం.

డ్రగ్స్ కేసులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన సిట్ ఎప్పుడూ రానాను, రకుల్‌ను విచారణకు పిలవలేదు. వారు అనుమానితుల జాబితాలోనూ లేరు. ఎలా వారికి ఈడీ సమన్లు జారీ చేసింది? అనేది మిస్టరీగా మారింది. కావాలనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఇంతకాలం వారి పేర్లను దాచి పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదకద్రవ్యాల‌ను సరఫరా చేసిన కెల్విన్ ముఠా రానా పేరును వెల్లడించినప్పటికీ ఆయన జోలికి వెళ్లలేదా? అనే అనుమానాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ రాఫెల్ అలెక్స్ విక్టరీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ రానా, రకుల్ ప్రీత్ సింగ్‌లకు సమన్లు జారీ చేసిందని సమాచారం. బాలీవుడ్‌లో సుశాంత్ ఆత్మహత్య క్రమంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసుల్లో, కన్నడ సినీరంగం శాండల్ వుడ్‌లో ఇద్దరు నటీమణులు రాగిణి, సంజనా, డ్రగ్స్ కేసు లింక్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిందని సమాచారం.

కీలక విషయాలు దాచారా?

హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను 2017 జూలైలో ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ముఠా సభ్యులు ఇచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా దాదాపు 60 మందిని విచారించారు. అందులో సుమారు10 మందికి పైగా సినీ ప్రముఖులున్నారు. ఈ కేసు నెల రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించింది. తెలుగు సినీరంగాన్ని కుదిపేసింది. అప్పట్లో సిట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సినీ రంగ ప్రముఖులతో పాటు డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చిన మరి కొంతమంది రక్తం నమూనాలు, గోళ్లు, జుట్టు నమూనాలను కూడా తీసుకొని పరీక్షలకు పంపారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు ఆరంభ శూరత్వం గానే మిగిలిపోయింది. తీవ్ర ఒత్తిడి క్రమంలో ప్రభుత్వం కేసును పక్కన పెట్టింది. కేసులో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్‌ను బదిలీ చేసింది. డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాపై 12 కేసులు నమోదు చేసి 11 చార్జిషీట్లను దాఖలు చేసి చేతులు దులుపుకున్నది.

అసలు విచారణలో ఏమి తేలింది.? ఎవరు డ్రగ్స్ వాడారు? ఎన్ని డబ్బులు చేతులు మారాయి? అనే విషయాలను అధికారులు మరుగున పడేశారు. డ్రగ్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం తొక్కి పెడుతున్నదని, వాస్తవాలను వెలుగులోకి తెచ్చి న్యాయం చేయాలని పీసీసీ చీఫ్​ తరఫున న్యాయవాది రేవతి హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తోపాటు సీబీఐ, ఎన్సీబీ, డీఆర్ఐల జోక్యాన్ని కోరారు. ఇదే అంశంపై రాష్ట్రపతికి కూడా రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు నుంచి వివరాలను వెల్లడించాలని ఆదేశాలు వచ్చినా రాష్ట్ర అధికారులు కాలయాపన చేశారు. సినీ ప్రముఖులను బాధితులుగా మాత్రమే చూపి, కౌన్సిలింగ్ చేసినట్టు చెప్పి తప్పించుకున్నారు.

ప్రస్తుతం ఈడీ బాలీవుడ్​, శాండిల్​వుడ్​తోపాటు టాలీవుడ్​పైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు, చార్జిషీట్లు, అనుబంధ పత్రాలను పరిశీలించింది. అందులో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయా? లేదా? అనేది అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దక్షిణాఫ్రికాకు చెందిన  రాఫెల్ ఎలెక్స్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది. బాలీవుడ్, కర్ణాటకలోని శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో రూ. 36 లక్షలకు పైగా విలువచేసే డ్రగ్స్ సరఫరా చేసినట్టు స్మగ్లర్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ ప్రధాన ఆధారంగా తీసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు డ్రగ్స్ సరఫరా‌లో పెద్ద మొత్తంలో డబ్బులు విదేశాలకు తరలి వెళ్లినట్టు ఈడీ భావిస్తున్నది. హవాలా ద్వారా డబ్బులు ఎలా వెళ్లాయి? ఎవరి చేతులు మారాయి? అన్న విషయమై ఆరా తీయనుంది. దర్యాప్తు ఆధారంగా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) చట్టం కింద కేసులు నమోదు చేయనుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..