కొత్త వ్యవసాయ చట్టాలు సస్పెండ్: సుప్రీంకోర్టు

by  |
కొత్త వ్యవసాయ చట్టాలు సస్పెండ్: సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు వెలువరించింది. సెప్టెంబర్‌లో తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని పేర్కొంది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు తమ డిమాండ్లు, సమస్యలు చెప్పుకోవడానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన భూపేందర్ సింగ్ మన్, షెట్కారీ సంఘటన్‌కు చెందిన అనిల్ ధన్వంత్, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రమోద్ కే జోషిలున్నారు. సాగు చట్టాలను సవాల్ చేస్తూ, వాటిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను నిరసన ప్రదేశం నుంచి తరలించాలన్న పిటిషన్లను సీజేఐ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్నది.

న్యాయ విచారణలో భాగంగా తాము ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ధర్మాసనం పేర్కొంది. ఉభయపక్షాల మధ్య ఈ కమిటీ మధ్యవర్తిత్వం వహించబోదని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి తమకు నివేదికను మాత్రమే సమర్పిస్తుందని వివరించింది. ఈ కమిటీ ముందు హాజరవ్వడానికి రైతు సంఘాలు సానుకూలంగా లేవని న్యాయవాది తెలుపగానే, ఇలాంటి వాదనలను తాము వినడానికి సిద్ధంగా లేమని పేర్కొంది. సమస్యను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ రైతులు నిరవధికంగా నిరసనలు చేయాలని భావిస్తే అలాగే కానివ్వండంటూ కటువుగా స్పందించింది. సమస్య పరిష్కారం కావాలనుకునేవారు ఈ కమిటీ ముందుకు వెళ్లండని పేర్కొంది.

ప్రధానిని ఆదేశించలేం

చట్టాల రద్దు డిమాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లో తాము వెనక్కి తీసుకోబోమని రైతులు స్పష్టం చేస్తున్నారని, ఇప్పటి వరకు ముఖ్యమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ తమను కలువనే లేదని వారు పేర్కొంటున్నారని అడ్వకేట్ ఎంఎల్ శర్మ తెలిపారు. వారి భూములను కంపెనీలకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన పడుతున్నట్టు వివరించారు. ఈ వాదనలో ప్రధానమంత్రి పార్టీగా లేరని, కాబట్టి రైతులను కలవాల్సిందిగా ఆయనను ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. కాంట్రాక్టు సాగు కోసం రైతుల భూములు అమ్మకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

పరేడ్ రద్దు చేసుకోవాలి…

ఈ నెల 26న రైతులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించారని, ఈ పరేడ్‌ను రద్దు చేసుకోవాలని ఆదేశించాల్సిందిగా సుప్రీంకోర్టును ఢిల్లీ పోలీసులు అభ్యర్థించారు. దీనిపై వివరణ ఇవ్వాలని రైతు సంఘాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు సోమవారం విచారించనుంది. రైతుల ఆందోళనలో ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నిషేధిత సంస్థ సభ్యులు చేరినట్టు సీనియర్ అడ్వకేట్ పీఎస్ నర్సింహా ఆరోపించారు. ఈ అభియోగాలు నిజమేనా? కాదా? ధ్రువీకరించాలని అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. రైతుల ఆందోళనలో ఖలిస్థానీలు చేరినట్టు తమకు సమాచారం అందిందని ఏజీ తెలిపారు. దీనిపై పూర్తి వివరణ కావాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఐబీ నివేదికలూ సమర్పిస్తామని పేర్కొంది.


Next Story

Most Viewed