‘మారటోరియం అవసరంలేదు.. రికవరీ మొదలైంది’

by  |
‘మారటోరియం అవసరంలేదు.. రికవరీ మొదలైంది’
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే రోజుల్లో మారటోరియం కొనసాగింపు అంశంపై ఆర్‌బీఐ రంగాల వారీగా విశ్లేషణ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఎస్‌బీఐ ఛైర్మెన్ రజనీష్ వెల్లడించారు. ఆగష్టు తర్వాత మారటోరియం కొనసాగింపు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గత వారంతంలో ఎస్‌బీఐ నిర్వహించిన రెండు రోజుల వర్చువల్ ఇంటర్నల్ మీటింగ్‌లో మాట్లాడిన రజనీష్.. ఆర్‌బీఐ వద్ద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం గణాంకాలు ఉన్నాయన్నారు. వీటి ఆధారంగానే మారటోరియం కొనసాగింపు నిర్ణయం తీసుకోనుంది. అత్యవసరమైన రంగాలకు మాత్రమే దీన్ని వర్తింపజేసే అవకాశాలున్నాయని, మిగిలిన వాటికి అవసరం లేదని తాను కూడా భావిస్తున్నట్టు రజనీష్ వివరించారు. ఇటీవల ఆర్‌బీఐ మారటోరియంను డిసెంబర్ వరకు కొనసాగించే అంశంపై ఆలోచిస్తున్నట్టు మీడియా అడిగిన ప్రశ్నకు రజనీష్ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో రికవరీ మొదలైందని, ఇది తెలియడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని రజనీష్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో సరఫరా వ్యవస్థ కుదేలైందని, ఏప్రిల్‌లో ఎక్కువ దెబ్బతిన్నప్పటికీ, మేలో కొంచెం మెరుగైందని, జూన్ నుంచి రికవరీ ప్రారంభమైందని రజనీష్ వివరించారు. ఊహించిన దానికంటే వేగంగానే రికవరీ ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో కరోనాను దృష్టిలో ఉంచుకుని మొదట మూడు నెలలు, తర్వాత మరో మూడు నెలలు మారటోరియం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీన్ని డిసెంబర్ వరకు పొడిగించాలనే వాదనలు వినిపిస్తున్నాయని, ఆగష్టు వరకు మారటోరియం సరిపోతుందని, ఏడాది చివరి వరకు అక్కరలేదని చెప్పారు. ఎస్‌బీఐలో 20 శాతం మంది మాత్రమే మారటోరియం ఎంపిక చేసుకున్నారని, మళ్లీ పొడిగించడం వల్ల ఉపయోగం లేదని… అయితే, కొన్ని రంగాలకు మారటోరియం అవసరమని రజనీష్ అభిప్రాయపడ్డారు. ఆరు నెలల మారటోరియం సంస్థ పునర్మాణం, ఉపశమనం కోసమని రజనీష్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి కావున ఇక కొనసాగించడం అవసరం లేదన్నారు.



Next Story

Most Viewed