ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నరు?

by  |
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నరు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకరు అంతర్జాతీయ సంస్థకు అధినేత అయితే, మరొకరు ఇండియాలోనే అత్యంత సంపన్న సంస్థకు అధిపతి. అలాంటి వారిద్దరూ ఒకచోట కూర్చుకుని సంభాషిస్తే ఎలా ఉంటుంది. ఇన్నేళ్ల వారి అనుభవంలో ఆర్థిక వ్యవస్థపై వారి దృష్టి ఎలాంటి మార్పులను చూడగలిగింది. భవిష్యత్తు గురించి ఇద్దరి అంచనాలు ఎలా ఉన్నాయనే ఆసక్తి కరమైన విషయాలు మనకు తెలుస్తాయి. ముంబైలో జరిగిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవోల సదస్సు కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మధ్య జరిగిన చర్చ గురించి తెలుసుకుందాం!

వందకోట్ల మందికి పైగా ఉన్న దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా సీఈవో పదవులను ఐదో వంతు భారతీయులే నిర్వహిస్తున్నారనే విషయాన్ని మనం విస్మరించకూడదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఇండియాలోని ప్రధాన వ్యాపార సంస్థలు సొంతంగా సాంకేతికతను కలిగి ఉండాలని సత్య నాదెళ్ల దేశీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. సమ్మిళిత వృద్ధిలో సాధన మరింత పెరగాలని, ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. గడిచిన దశాబ్ద కాలంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ ద్వారా టెక్నాలజీ భారీ స్థాయిలో పెరిగిందని, అయితే, ప్రధాన సంస్థలే దీని ద్వారా లబ్ధి పొందాయని అన్నారు. ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవోల సదస్సు ఇండియాలో మూడురోజులపాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సత్య నాదెళ్ల టెక్నాలజీ, ఇండియన్ కంపెనీలకు మైక్రోసాఫ్ట్ పనితీరు గురించి వివరించారు.

‘దేశీయ కంపెనీలు ఏదైనా టెక్నాలజీని రూపొందించే సమయంలో అన్ని రకాలుగా ఆర్థిక వృద్ధికి ఎలా ఉపయోగపడతాయన్నది దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుందని సత్య నాదెళ్ల చెప్పారు. దిగ్గజ సంస్థలు సాంకేతిక సామర్థ్యాలను పెంచుకుంటూనే టెక్నాలజీకి సంబంధించి మార్పులను వీలైనంత వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత పదేళ్లలో వినియోగదారుల వ్యయ ధోరణులే ముఖ్యమనే స్థాయిలో ఆర్థిక రంగం కొనసాగిందని, కానీ ఆర్థిక రంగం మాత్రమే దేశాన్ని వృద్ధిలోకి తీసుకురాదనే విషయాన్ని గుర్తించుకోవాలని సత్య నాదెళ్ల చెప్పారు. ప్రైవసీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వినియోగంలో సంబంధిత వర్గాల్లో విశ్వాసం పెంచేలా టెక్నాలజీలను వినియోగించే సంస్థలు వ్యవహరించాలన్నారు. గతంతో పోలిస్తే ఇప్పటి సాంకేతిక రంగంలోని ఉద్యోగాల్లో నైపుణ్యం మారిందని, అన్ని సంస్థలూ ప్రస్తుత సాంకేతికతను ఉపయోగిస్తున్నాయన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 70 శాతం ఉద్యోగాలు టెక్నాలజీకి సంబంధం లేని సంస్థల్లోనే ఉంటున్నాయని లింక్డ్ఇన్ నివేదికను సత్య నాదెళ్ల ప్రస్తావించారు. ఇవి కాకుండా ప్రధానంగా ఇప్పటి కంపెనీలు సైబర్ సెక్యూరిటీ అంశంపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు. ఇదే సందర్భంలో ఓలా, రిలయన్స్ ఇండస్ట్రీస్, పిరమల్ గ్లాస్ సంస్థలు ఉపయోగిస్తున్న సాంకేతిక వినియోగాన్ని సత్య నాదెళ్ల గుర్తు చేశారు.

ముఖేశ్ అంబానీతో జరిగిన చర్చలో ఇద్దరి మధ్య సాగిన సంభాషణ ఎంతో ఆసక్తికరంగా మారింది. రానున్న కాలంలో రిలయన్స్ సంస్థతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఎంతో కీలకమైనదిగా సత్య నాదెళ్ల ప్రస్తావించారు. అంతర్జాతీయంగా వేరే దేశంతో పోల్చుకున్నప్పటికీ మొబైల్ నెట్‌వర్క్ మన దేశంలోనే మెరుగ్గా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చెప్పారు. అంతర్జాతీయంగా ముఖ్యమైన డిజిటల్ దేశంగా ఇండియా మారే అవకాశం ఉందని అంబానీ పేర్కొన్నారు. సత్య నాదెళ్లతో జరిగిన సంభాషణలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇండియా మరో దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని, అందులో అనుమానం ఏమాత్రం లేదని ముఖేశ్ అంబానీ చెప్పారు. అయితే, ఈ పరిణామం ఐదేళ్లలోనా, పదేళ్లలోనా అనే చర్చించాలని, సాంకేతికతను వినియోగించుకోవడంలో అవసరమైన ప్రమాణాలను ఏర్పరచుకోగలమా? అనే ప్రశ్న మన ముందుంది అని ముఖేశ్ అంబానీ తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో గడిచిన రెండున్నర దశాబ్దాల కాలంలో అనేక మార్పులొచ్చాయని ముఖేశ్ అంబాని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలతో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్ దేశీయంగా సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. జియోను ప్రారంభించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. జియో రావడానికి ముందు దేశంలో డేటా ధర ఒక జీబీకి రూ. 300 నుంచి రూ.500 వరకూ ఉండేదని ఇప్పుడు కేవలం రూ. 12 నుంచి రూ. 14 మాత్రమే ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో దేశీయంగా గేమింగ్ వ్యాపారం అతిపెద్ద మార్పులను తీసుకు రాగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయులందరూ గర్వపడే స్థాయిలో మైక్రోసాఫ్ట్ సంస్థను సత్య నాదెళ్ల కొనసాగిస్తారని ముఖేశ్ అంబానీ తెలిపారు.

Next Story