సెకండ్ హ్యాండైనా… సోలో జర్నీ బెటర్

by  |
సెకండ్ హ్యాండైనా… సోలో జర్నీ బెటర్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో ఓవైపు వాహనదారులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో నగర రోడ్లపై ఇటీవల వరకు ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఇటీవల కాలంలో కరోనా లాక్ డౌన్ ఎత్తివేసి ఆంక్షల మధ్య బయట తిరిగేందుకు ప్రభుత్వం అనుమతించింది. మొదట్లో బయటకు రావడానికి ఇబ్బందులు పడిన వాహనదారులు క్రమక్రమంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సొంత వాహనాలపై బయటకు వస్తు న్నారు. సొంత వాహనాలు లేని వారు అప్పు చేసైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగర రోడ్లపై ట్రాఫిక్ ఎంతో పెరిగిపోయి కరోనాకు ముందు పరిస్థితులు కనబడుతున్నాయి.

రోడ్ల పైకి సొంత వాహనాలు….

కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గక పోవడంతో ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలతో బయటకు వచ్చి పనులు చూసుకుంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులతో అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోయింది. కరోనా ప్రభావం తో నెలల పాటు బస్సులను సైతం నిలిపి వేశారు. ఐతే ఇటీవల కాలంలో కొవిడ్ నిబంధనలతో రోడ్లపైకి ఆర్టీసి బస్సులను అనుమతించినా వాటిల్లో రద్దీ అంతంత మాత్రంగా ఉంటోంది. కరోనాకు ముందు మాదిరిగా రోడ్లపై ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా ప్రజలు వినియోగిస్తున్న సొంత వాహనాలు కూడా తోడై రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు.

పెరిగిన సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయాలు…

కరోనా ప్రభావంతో ప్రజలు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోకుండా సెకండ్ హ్యాండ్ లో నైనా సొంత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, క్యాబ్ సర్వీస్, ఆటోలే కాకుండా అనేక రకాల రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక నగరంలోనే దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు మెట్రో మంచి సౌకర్యంగా భావించారు. ఐతే కరోనా ప్రభావంతో మెట్రో రైళ్ల తో పాటు అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను నిలిపి వేశారు. ఇటీవల తిరిగి అన్ని రవాణా వాహనాలకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఐనా ప్రజలు గతంలో మాధిరిగా ప్రజా రవాణా వాహనాల ద్వారా ప్రయా ణాలు చేయడం లేదు. ప్రజల ఆర్ధిక స్థితిని బట్టి సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసి ప్రయాణిస్తుండడంతో నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలో కరోనాకు ముందు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉండేవో అంతకంటే అధికంగా కనబడుతోంది.

Next Story