సాగర్‌లో నువ్వా-నేనా.. ఊపందుకున్న పోరు

by  |
Sagar by-elections,
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచార పర్వానికి తేరలేచింది. మూడు ప్రధాన పార్టీలకు తోడు ఇండిపెండెంట్లు భారీగానే పోటీలో ఉన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో తుదిపోరులో ఎంతమంది అభ్యర్థులు నిలుస్తారనేది తేలాల్సి ఉంది. ఉపఎన్నిక పోరులో ఇండిపెండెంట్ల సంగతి ఎలా ఉన్నా.. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల మధ్యే రసవత్తర పోరు సాగనుంది. అయితే ఈ ఉపఎన్నికలో రెబల్స్ అభ్యర్థుల బెడద ఎక్కువగా లేకపోవడం గమనార్హం. బీజేపీ నుంచి ఒక్క నామినేషన్ దాఖలైనా… అది తుది పోరులో ఉంటుందా.. లేదా అన్నది అనుమానమే. పోటీలోని ప్రధాన అభ్యర్థులు ఎవ్వరికీ వారుగా తమ గెలుపు లెక్కలను అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ రాజకీయ, సామాజిక సమీకరణాలను లెక్కగట్టడంలో బిజీగా మారారు. సాగర్ ఉపఎన్నిక ప్రచార ప్రక్రియ మంగళవారం నుంచి ముమ్మరం అయిన నేపథ్యంలో ‘దిశ’ ప్రత్యేక కథనం.

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న జానారెడ్డి..

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉపఎన్నిక పోరు ఇక నుంచి హోరాహోరీగా సాగనుంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈసారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో జానారెడ్డి ముందుకు సాగుతున్నారు. అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో రెండు నెలలుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ గతంలో తనకు దూరంగా ఉండిపోయిన క్యాడర్‌ను, నేతలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లోని కీలక నేతలను తీసుకొచ్చి హాలియాలో బహిరంగసభను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపారు.

12 మంది ఎమ్మెల్యేలు.. మంత్రులు ఇక్కడే..

అదే సమయంలో టీఆర్ఎస్ సైతం ఇప్పటికే సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించింది. ప్రతి మండలానికి ఓ ఎమ్మెల్యే, మున్సిపాలిటీకి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున ఎన్నికల ఇన్‌ఛార్జులుగా నియమించిన సంగతి తెలిసిందే. ప్రతి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా ఉన్న గ్రూపు రాజకీయాలను పరిష్కరిస్తున్నారు. దాదాపు ఎమ్మెల్యేలంతా గత 25 రోజులుగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ పూర్తిస్థాయి పట్టు సాధించారనే చెప్పాలి. నిన్నటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలియకపోవడం.. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తుండడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఉండేది. కానీ ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 12మందికి పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిష్టవేసి ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఉపఎన్నిక పోరు నువ్వు నేనా అన్నట్టుగా సాగుతోంది.

ఎస్టీ సమీకరణం ఫలించేనా..?

ఇక బీజేపీ విషయానికొస్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నుంచి పోటీ చేసిన కంకణాల నివేదితారెడ్డి ఈసారి టికెట్ ఆశించి భంగపడింది. కానీ అప్పటికే నివేదితారెడ్డి నామినేషన్ వేసింది. దీంతో ఆమె సాగర్ ఉపఎన్నిక బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగే అవకాశం ఉంది. సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్‌‌ను అధిష్టానం గుర్తించి బీ ఫామ్ అందించడంతో ఆయన మంగళవారం నామినేషన్‌ను వేశారు. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్యయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కడారి అంజయ్యయాదవ్ టీఆర్ఎస్‌లో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. కంకణాల శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య నివేదితారెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేరతారనే ఊహగానాలు షికార్లు చేస్తున్నాయి. దీంతో బీజేపీ క్యాడర్ అయోమయ స్థితిలో పడిపోయింది. ఇదే సమయంలో సాగర్ నియోజకవర్గంలో అధికంగా ఎస్టీ ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఆ సమీకరణాలు తమకు కలిసొస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ గెలుపు అంచనాలను వేసుకుంటున్నారు.



Next Story

Most Viewed