అయోధ్య గుడి కోసం ‘నిధి సేకరణ’.. అధికార పార్టీ నిఘా!

by  |
అయోధ్య గుడి కోసం ‘నిధి సేకరణ’.. అధికార పార్టీ నిఘా!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అయోధ్యలో రాములోరి ఆలయ నిర్మాణం కోసం చేపట్టిన నిధి సేకరణకు ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ఈ కార్యక్రమం బీజేపీకి ఎంత లాభం చేకూర్చనుంది? ఎంతమేర నిధి సేకరణ జరుగుతోంది? అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలని విశ్వహిందూపరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యాచరణ రూపొందించుకున్నాయి. రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమంతో ప్రతీ ఇంటిని టచ్ చేయాలని భావిస్తున్నాయి. రాజకీయాలకు సంబంధం లేకుండా హిందూ సమాజాన్ని భాగస్వాములను చేస్తున్నామని ఆయా సంస్థలు చెప్తున్నా అంతర్గతంగా మాత్రం ఆయా సంస్థల లక్ష్యం బీజేపీ నిర్మాణామేననే చర్చ జరుగుతోంది.

దీనిని గమనించిన ప్రభుత్వం దానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘావర్గాలు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం రామాలయ నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమంతో బీజేపీ ప్రతి గడపనూ టచ్ చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని స్పష్టం చేసినట్టు సమాచారం. అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో క్షేత్ర స్థాయిలో మూలాల వరకు వెళ్లి నిధి సేకరణ జరిపించాలని నిర్ణయించడం వెనుకున్న కారణాల్లో బీజేపీని బలోపేతం చేయడమే ప్రధానమైనదని ఇంటలీజెన్స్ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలిసింది. బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా తాము హిందూ వ్యతిరేకులం కాదన్న విషయాన్ని చేతల్లో చూపించాలని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మూడు దశాబ్దాల తరువాత మళ్లీ..

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై 1989లో విశ్వహిందూ పరిషత్ రామ శిలాన్యాస్ పేరిట ప్రతి గ్రామంలో కార్యక్రమం చేపట్టింది. 1990లో రామ జ్యోతి కార్యక్రమం నిర్వహించింది. శిలన్యాస్ సందర్భంగా రామ శిలలను గ్రామగ్రామానికి పంపించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ క్రమంలో చాలా గ్రామాల్లో ఈ రెండు కార్యక్రమాలకు భారీగానే స్పందన లభించింది. సమాచార వ్యవస్థ అంతగా లేని రోజుల్లోనే మారుమూల పల్లెలకు సైతం రామ మందిర నిర్మాణం కోసం జరిపిన పోరాటం గురించి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు సమాచారం వ్యవస్థ తీవ్రంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం పేరిట సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువగా ఈసారి బీజేపీ పట్టుబిగించే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయలను కూడా నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎత్తులకు పైఎత్తులేసేందుకు పక్కా ప్రణాళికలు రచించడంలో అధికార పార్టీ శ్రేణులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed