ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి

41
RTC

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కార్మికులను వేధింపులకు గురి చేస్తోందని, పని ఒత్తిడికి గురి చేస్తుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై మాట్లాడినా, ప్రశ్నించినా బదిలీలు చేస్తున్నారని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మికులకు 2017 నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందని, రెండు పీఆర్సీలు పెండింగ్​పెట్టారని, 6 డీఏలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సీఎం కేసీఆర్.. కార్మికులతో ప్రగతిభవన్​లో మీటింగ్​పెట్టి ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు దానిపై మాట్లాడటం లేదన్నారు. కొత్త బస్సులు కొనడం లేదని, నియామకాలు చేయడం లేదని, రిటైర్​ అయిన వారికి సెటిల్​మెంట్​డబ్బులు ఇవ్వడం లేదని రాజిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనలకు దిగుతుందని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పుతున్నారని, ఈ నిరసనలను స్వాగతిస్తున్నామని కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీలో యూనియన్లు అవసరం లేదని, కార్మిక చట్టాలు, ట్రేడ్​యూనియన్ల హక్కులను గౌరవించడం లేదని, కార్మిక ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తే ముందుగా ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటాలకు మద్దతు ఉంటుందని, లేని పక్షంలో సంక్రాంతి భోగి మంటల సాక్షిగా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధం కావాలని రాజిరెడ్డి పిలుపునిచ్చారు.