ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు ఇలా..

by  |
ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు ఇలా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజా రవాణా భారం కానుంది. పేదోడి ప్రయాణ ఖర్చులు పెరగనున్నాయి. ఆర్టీసీ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. చార్జీల పెంపుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే సంకేతాలు వచ్చాయి. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపుపై నేడు సీఎం కేసీఆర్​ను కలిసి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ ప్రకటించారు. ఇదే సమయంలో బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆర్టీసీ చైర్మన్​, ఎండీతో ట్రాన్స్​పోర్ట్​ భవన్​లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు.

పెంచుతున్నాం

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పదని, అయితే డిపోలను ఎత్తివేయడం లేదని, అవసరాన్ని బట్టి ఉద్యోగులను పలు డిపోలకు అడ్జెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. చార్జీల పెంపుపై బుధవారం మరోసారి సీఎం కేసీఆర్‌తో భేటీ ఉందని, ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఇప్పటికే నివేదికలు ఇచ్చామని, బుధవారం భేటీలో సీఎం కేసీఆర్ ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటారని, తెలంగాణలో ఆర్టీసీలో ఛార్జీలు పెంచినా.. పక్క రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డీపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను నిర్వహించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్లో నిర్వహించిన రక్త దాన శిబిరాన్ని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడారు.

అదే ఫైనల్​

ఏటా రూ. 900 కోట్లను రాబట్టుకునే ప్రతిపాదనలకు ఆమోదం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పుతున్నారు. నాలుగు ప్రతిపాదనలు చేస్తే.. ఇప్పటికే సీఎంకు నివేదించారు. అయితే ఈ నాలుగింటిలో మంత్రి, ఆర్టీసీ చైర్మన్​, ఎండీ ఆధ్వర్యంలో ఒక దానిపై నిర్ణయం తీసుకున్నారు. పల్లె వెలుగుకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్​ప్రెస్​, ఆపై బస్సులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటరుకు 25 పైసలు, మెట్రో ఎక్స్​ప్రెస్​పై కిలోమీటరుకు 30 పైసల చొప్పున పెంచేందుకు నిర్ణయం తీసుకుని సీఎం కేసీఆర్​ ఆమోదానికి పంపించారు.

అయితే సీఎం కేసీఆర్​ నుంచి ఇంకా నిర్ణయం రాలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి చార్జీలపై సమీక్షిస్తున్నారు. ఈ సమీక్ష తర్వాత పూర్తిస్థాయి నివేదికను సీఎం కేసీఆర్​కు పంపిస్తారని అధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్​ ఆర్టీసీ చార్జీల పెంపును ప్రకటించే అవకాశం ఉంది.

ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పువ్వాడ


Next Story

Most Viewed