మై హోం ఇష్యూపై సవాళ్లు, ప్రతి సవాళ్లు..

by  |
మై హోం ఇష్యూపై సవాళ్లు, ప్రతి సవాళ్లు..
X

సూర్యాపేట జిల్లా : హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ప్రమాణాల సవాళ్లతో కూడిన రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల జరిగిన మైహోం సిమెంట్ మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మై హోంకు మీరంటే.. మీరు అమ్ముడుపోయారంటూ సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలు దుమ్మెత్తిపోసుకున్నాయి. అంతేకాకుండా తమ తప్పు లేదని శివుడిపై ప్రమాణం చేయాలంటూ ఇరు నేతలు సవాల్ విసురుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆలయం వద్దకు బీజేపీ నేతలు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి మై హోం సంస్థకు మీరంటే మీరు అమ్ముడుపోయి ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు పలికారంటూ విమర్శించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం మొదలైంది. నిజాయితీని నిరూపించుకునేందుకు మేళ్లచెరువు శివాలయంలో ప్రమాణం చేయాలని భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు శివాలయానికి వచ్చారు.

సోషల్ మీడియాలో టీఆర్ఎస్ తరఫున సవాల్ విసిరిన నాగిరెడ్డి అనే వ్యక్తి మాత్రం తనకు టీఆర్ఎస్‌తో సంబంధంలేదని కామన్ మ్యాన్‌గా వచ్చానని.. దేవుడిపై ప్రమాణానికి బీజేపీ సిద్ధమా అంటూ వాదనకు దిగారు. దీంతో శివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.



Next Story

Most Viewed